కట్టంగూర్, ఫిబ్రవరి 23 : ప్రభుత్వ చేతగాని తనంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఆదివారం ఎండిపోయిన రైతు బీమనబోయిన భిక్షం పంట పొలాలను పరిశీలించి సమస్యలను రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చిన 13నెలల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. కండ్ల ముందే ఎండిపోతున్న పంట పొలాలను రైతులు కాపాడుకోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ పాలనలో సాగునీరు లేక, కరెంట్ సకాలంలో రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఎంపిక చేసిన పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో కూడా సగం మంది రైతులకు రైతు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాడి పంటలతో సంతోషంగా ఉన్న రాష్ర్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బీడు భూములుగా మార్చిందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంతి కేసీఆర్ రైతులను రాజు చేయాలని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలువగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని అన్నారు. కరువుతో తీవ్రంగా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఎకరానికి రూ.50వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, పోగుల నర్సింహ, పెద్ది బాలనర్సయ్య, నాయకులు పనస సైదులు, అంతట ఇశ్రీను, రెడ్డిపల్లి మనోహర్, వడ్డె సైదిరెడ్డి ఉన్నారు.