మిర్యాలగూడ రూరల్, జనవరి 29 : తన కలను నెరవేర్చుకునేందుకు 2015లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. 2020లో బంగ్లాదేశ్‌కు చెందిన అమ్మాయిని అమెరికాలో పెండ్లి చేసుకున్నాడు. ఏడు సంవత్సరాల తరువాత మాతృభూమికి వచ్చి తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భార్యతో కలిసి ఫ్లైట్ దిగాడు. తాము వస్తున్నట్లు ముందుగానే తల్లిదండ్రులకు కబురు పంపడంతో వారు డ్రైవర్‌కు కారిచ్చి ఎయిర్‌పోర్ట్‌కు పంపారు. అక్కడి నుంచి సంతోషంగా కారులో బయల్దేరారు.
మరో రెండు గంటలైతే ఇంటికి వస్తారని తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే విధి వక్రీకరించింది. వారిని దురదృష్టం వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న కారు మార్గమధ్యంలో ప్రమాదానికి గురవడంతో ఎన్ఆర్ఐ మృతి చెందాడు. రెండు గంటలైతే కొడుకు, కోడలును చూసి ఆనందబాష్పాలు రాల్సాల్సిన తల్లిదండ్రులు కన్న కొడుకు మరణ వార్తతో కన్నీళ్లపర్యంతమయ్యారు. ఆనందం నిండాల్సిన ఇల్లు విషాదంలో మునిగిపోయింది. ఈ హృదయ విదారక
సంఘటన వివరాలివీ..
అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఏడేండ్ల తరువాత ఇండియాకు వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కారులో ఇంటికి బయల్దేరిన ఎన్ఆర్ఐ మార్గమధ్యంలో కారు పల్టీ కొట్టి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై గూడూరు వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు పట్టణం నల్లపహాడ్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన జానీపాషా కుమారుడు నూర్‌బాషా కమల్‌హసన్, కోడలు నూజాత్ ఫాతిమా అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం, సెయింట్లూయీస్ సిటీలో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తూ ఏడేండ్ల తరువాత ఇండియాకు బయల్దేరారు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో తెల్లవారుజామున ఫ్లైట్ దిగారు. వారిని పికప్ చేసుకొనేందుకు అప్పటికే గుంటూరు నుంచి డ్రైవర్ షేక్ కరీముల్లా కారుతో విమానాశ్రమానికి వెళ్లాడు. వారిని కారులో ఎక్కించుకొని గుంటూరు బయల్దేరారు.
ఈ క్రమంలో మిర్యాలగూడ దాటాక అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై గూడూరు వద్ద అదుపుతప్పిన కారు రోడ్డు వెంట ఉన్న సేఫ్టీ పిల్లర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ప్రమాదంలో నూర్‌బాషా కమల్‌హసన్(36) కారు నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య నూజాత్ ఫాతిమా, కారు డ్రైవర్ కరీముల్లా స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రాంతీయ దవాఖానకు తరలించినట్లు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఇక్కడికి వచ్చారు. తండ్రి జానీపాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.