కట్టంగూర్, నవంబర్ 22 : కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పొన్న అంజయ్య, సీఐటీయూ కట్టంగూర్ మండల సమన్వయ కమిటీ కన్వీనర్ చెరుకు జానకి డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ రద్దు చేయాలని శనివారం కట్టంగూర్ లో సీఐటీయూ మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పోరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
అసంఘంటిత రంగ కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. కార్మికుల వేతనాలల్లో 50 శాతానికి మించరాదనే షరతుల కారణంగా కార్మికులకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ జీఓను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కత్తుల రామలింగయ్య, సైదులు, లక్ష్మి, ఏకుల యాదమ్మ, గిరి, అశోక్, శంకర్, లింగయ్య పాల్గొన్నారు.