పట్టించుకునే వారు లేక యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రగతి కుంటుపడుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో పైసా నిధులు విడుదల కాకపోవడంతో అభివృద్ధి పనుల ముచ్చటే లేదు. అనేక పనులు ప్రతిపాదనలకే పరిమితవుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిన జిల్లా.. ఇప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోతున్నది.
– యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ)
యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా ఉండగా.. మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లోని పలు మండలాలు జిల్లా పరిధిలో ఉన్నాయి. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
ఈ ఏడాది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) ఒక్క పైసా విడుదల కాలేదు. తూ.తూ.మంత్రంగా ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 10 కోట్ల నిధులు మంజూరు మాత్రమే ఇచ్చారు. దీనికి సంబంధించి అధికారులు వివిధ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలో 337 వివిధ పనులకు 12.40 కోట్లు అవసరమని గుర్తించగా, కేవలం మంజూరు మాత్రమే ఇచ్చారు. భువనగిరి నియోజకవర్గంలో రూ.1.62 కోట్లతో 66 పనులు, ఆలేరు నియోజవకర్గంలో రూ.4.92 కోట్లతో 128 పనులు, మునుగోడు నియోజకవర్గంలోని రెండు మండలాలకు రూ.1.74 కోట్లతో 86 పనులు, తుంగతుర్తిలో రూ.2.97 కోట్లలో 27 పనులు, నకిరేకల్ నియోజకవర్గంలోని ఒక మండలానికి రూ.1.13 కోట్లతో కేవలం మంజూరు ఇచ్చారు. నిధులు విడుదల కాకపోవడంతో ఏ పని కూడా అడుగు మందుకు పడడం లేదు.
ఎమ్మెల్యేల వద్ద నిధులు ఉంటే పలు రకాల అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, భవనాలు, ప్రహరీలు, కమ్యూనిటీ భవనాలు, కమిటీ హాళ్ల వంటి వాటికి నిధులు కేటాయించవచ్చు. కానీ నిధులు రాకపోవడంతో ఏ పని కూడా చేసే పరిస్థితి లేదు. దాంతో పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి కుంటు పడుతున్నది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇటీవల వానకాలంలో ధ్వంసమైన రోడ్లు కనీసం మరమ్మతులకు నోచడం లేదు. అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొన్నా పరిష్కరించేవారు లేరు, ఇక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీల సంగతి దేవుడెరుగు.
ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు కొత్త ప్రభుత్వంపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త ప్రాజెక్టులు, నిధులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు జిల్లాకు ఒరిగిందేమీ లేదు. పాత వాటితోపాటు కొత్త కార్యక్రమాల ఊసేలేదు. ఇటీవల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల విషయంలోనూ జిల్లాకు అన్యాయం జరిగింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాకు రెండేసి చొప్పున పాఠశాలలకు శంకుస్థాపన చేయగా, యాదాద్రికి మాత్రం ఒక్కటీ కేటాయించలేదు. గంధమల్ల రిజర్వాయర్ విషయంలోనూ ముందడుగు లేదు. ఆలేరు రెవెన్యూ డివిజన్, భువనగిరి డిగ్రీ కాలేజీ వంటి ఎన్నో హామీలు కార్యరూపం దాల్చలేదు. జిల్లాకు వచ్చిన ఐఐహెచ్‌టీని తరలించుకుపోతున్నా పట్టించుకునే ప్రజాప్రతినిధులు కరువయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాకు నిధులు వరదలా పారాయి. అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంటపడి మరీ నిధులను తీసుకొచ్చారు. సీడీపీతోపాటు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, టీఎయూఎఫ్ఐడీసీ, హెచ్ఎండీఏ నిధులు పెద్దఎత్తున విడుదల చేయించారు. అప్పటి సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును ప్రత్యేకంగా కలిసి సమస్యలను విన్నవించడంతోపాటు నిధులను వెంటవెంటనే విడుదల చేయించేందుకు కృషి చేసేవారు. మాజీ ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఏకంగా ఒకే దఫాలో రూ.45 కోట్ల స్పెషల్ ఫండ్స్‌ను తీసుకువచ్చి భువనగిరి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టడం అందరికీ తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వంలో సీడీపీ నిధుల ఊసే లేదు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పలు రకాల అభివృద్ధి పనులకు తమ పరిధిలోనే నిధులు కేటాయించుకునేందుకు ఇవి ఉపయోగపడుతాయి. ఆర్థిక సంవత్సరంలో ఒక నియోజకవర్గానికి రూ.5 కోట్ల సీడీపీ నిధులు ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో కోటి మాత్రమే ఉన్న నిధులను బీఆర్ఎస్ హయాంలో రూ.5 కోట్లకు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు సీడీపీ నిధుల విడుదలే లేదు. కనీసం మంజూరు కూడా కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ పార్టీ అలివి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కేవలం పది నెలల్లోనే విఫల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. హామీలు అమలు దేవుడెరుగు. కనీసం ఎమ్మెల్యేల నిధులు కూడా విడుదల చేయకపోవడం దారుణం. ఇలా అయితే అభివృద్ధి ఎలా ముందుకు సాగుతుంది. ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడమేనా ప్రజా పాలనా? కాంగ్రెస్ మార్పు అంటే ఇదేనా? ఇందుకేనా ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించుకున్నది. కొత్త ప్రాజెక్టులు కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఉండి ఏం లాభం? వెంటనే అభివృద్ధి నిధులను విడుదల చేయించి, పనులకు శ్రీకారం చుట్టాలి.
– బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు