నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై గురువారం హైకోర్టులో కీలక విచారణ కొనసాగనుండగా మరోవైపు స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. గత నెల 29వ తేదీన ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే గురువారం నుంచి తొలి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10. 30 గంటలకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దీంతో నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది.
గురువారం నుంచి మూడు రోజుల పాటు అంటే ఈ నెల 11వ తేదీ వరకు తొలి విడత నామినేషన్ల స్వీకరణ కొనసాగుతంది. ఉమ్మడి జిల్లాలో తొలి విడతగా నల్లగొండ, దేవరకొండ, సూర్యాపేట, భువనగిరి రెవె న్యూ డివిజన్ల పరిధిలోని మండలాల్లో నామినేషన్ల స్వీకరణ మొదలవుతుందని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు బుధవారం విచారణ మొదలు పెట్టి తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
అయితే గురువారం హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలో కొనసాగుతుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యధావిధిగా తొలి విడత ఎన్నికలకు సిద్ధమైంది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం సాయం త్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గురువారం నుంచి తొలి విడత నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో తొలి విడతలో జడ్పీటీసీ, ఎం పీటీసీ ఎన్నికలు జరగాల్సిన మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.
ప్రతిరోజూ ఉద యం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తూ… ఎన్నికల అధికారులను నియమించారు. ఈ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అభ్యర్థితో పాటు మ రో ఇద్దరిని మాత్రమే నామినేషన్లు దాఖలు చేసేందుకు లోనికి అనుమతిస్తారు. అయితే తొలి రోజు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులంతా నామినేషన్ పత్రాలు తీసుకెళ్లేందుకే పరిమితం కానున్నట్లు సమాచారం. రేపు, ఎల్లుండి వరకు స్వీకరణకు గడువు ఉండడంతో చివరి రోజు మెజార్టీ నామినేషన్లు దాఖలు కావొచ్చని అంచనా.
13న తుది విడత..
ఈ నెల 13వ తేదీ నుంచి రెండో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. వరుసగా మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ, అనంతరం పరిశీలన, తర్వాత అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం, ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల తుది జాబితా వెల్లడి కానుంది. తొలి విడత పోలింగ్ ఈ నెల 23న, రెండో విడత 27న జరుగనుండగా వచ్చే నెల 11న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది.
నామినేషన్ల స్వీకరణకు సిద్ధం..
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం నుంచి తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణకు సిద్ధంగా ఉన్నట్లు నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె జిల్లాలోని ఏర్పాట్లపై స్పందిస్తూ ఇప్పటికే ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలు శిక్షణ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారని వివరించారు. జిల్లా ఎస్పీ పవార్‌తో కలిసి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించామని, అన్ని కేంద్రాల వద్ద హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్ల కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఆయా పార్టీల నేతలు సహకరించాలని కోరారు.
అందరి దృష్టి హైకోర్టు వైపే..
ఓ వైపు నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండగా మరోవైపు అందరి దృష్టి హైకోర్టు తీర్పుపైనే కేంద్రీకృతమైంది. హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది అందరిలో తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ప్రభు త్వ వర్గాలు ఎన్నికలు యధావిధిగా జరుగుతాయని చెప్తుండగా మిగతా రాజకీయ పార్టీలు మా త్రం మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నాయి.
ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లినా రాను న్న రోజుల్లో హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టులు దీనిపై ఎలా స్పందిస్తాయోనన్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా? ఒక వేళ జరిగినా అవి కోర్టు తీర్పులకు నిలబడతాయా? అన్న మీమాంస నెలకొంది. దీంతో ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలపై పూర్తి స్థాయి కసరత్తు చేసినట్లు కనపడటంలేదు. గ్రామాల వారీగా సన్నాహాక సమావేశాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై ఇంకా సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు లేదు. సాధారణంగా స్థానిక ఎన్నికలు అంటే ఉండాల్సిన జోష్ కూడా పల్లెల్లో లేదన్నది నిజం. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.
తొలివిడతలో..
తొలి విడతలో భాగంగా నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, దేవరకొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 18 జడ్పీటీసీ, 197 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. ఈ మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 జడ్పీటీసీ, 112 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడతల ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ విడుదల చేయనున్నారు.
ఇక్కడ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 జడ్పీటీసీ, 84 ఎంపీటీసీ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక్కడ స్థానిక ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు.