హాలియా, డిసెంబర్ 3: అనుముల మండలం పేరూరులో సర్పంచ్ ఎన్నికలు లేనట్లేనని స్పష్టమవుతుంది. సర్పంచ్, వార్డు మెంబర్లకు గ్రామం నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయకపోవడంతో ప్రభుత్వం ఈ గ్రామంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ సక్రమంగా లేదని పేర్కొంటూ పేరూరు గ్రామస్తులు మూకుమ్మడిగా ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో సర్పంచ్, 8 వార్డులు ఉం డగా గ్రామం నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. దీంతో గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఎన్నికలను బహిష్కరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పేరూరు పేరు హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పేరూ రు గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించ డం ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారింది. పంచాయతీలో ఉన్న 8 వార్డుల్లో నాలుగు వార్డులను సైతం ఎస్టీలకు రిజర్వు చేశారు. కానీ గ్రామ పంచాయతీలో ఒక్క ఎస్టీ మహిళా ఓటర్ కూడా లేదు. గ్రామంలో ఎస్టీ మహిళా ఓటర్ లేనప్పుడు పం చాయతీని ఎస్టీ మహిళకు ఎలా రిజర్వు చేశారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అంటే స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రకటన అంతా తప్పులతడకగా ఉందని, అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రిజర్వేషన్లు తయారు చేసి అమలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
గ్రామ పంచాయతీలో మొత్తం 792 మంది ఓటర్లలో 421 మంది పురుషులు కాగా, 371 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 665 మంది బీసీ ఓటర్లు కాగా, 107 మంది ఎస్సీ ఓటర్లు, 20 మంది ఓసీ ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఒక్కరిని కూడా అధికారులు ఓటర్ జాబితాలో నమోదు చేయలేదు. కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని మాత్రం ఎస్టీ మహిళకు రిజర్వేచేశారు. అధికారులు మా గ్రామ పంచాయతీని ఎస్టీ మహిళలకు ఏ ప్రాతిపదికన రిజర్వు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలడి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
పంచాయతీ ఓటర్లిస్టులో 107 మంది ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉన్నప్పటికీ ఒక్క వార్డు కూడా ఎస్సీలకు ఎందుకు కేటాయించలేదని దళిత సంఘం నేతలు ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీస్తున్నారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో మా గ్రామ పంచాయతీ రిజర్వేషన్ చూసిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పోయిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రజాప్రభుత్వం పేరుతో కాంగ్రెస్ నయవంచక పాలన సాగిస్తుందని గ్రామస్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్రం అంతా అన్ని గ్రామాల్లో ఎన్నికల కోలాహలం ఉంటే అనుముల మండలం పేరూరు గ్రామంలో మాత్రం నిశబ్ధ వాతావరణం ఉంది. సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడం గమనార్హం.
అనుముల మండలం పేరూరు గ్రామస్తులు ప్రభుత్వం ప్రకటించిన గ్రామ పంచాయతీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ..గ్రామం నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయకపోవడంతో ప్రభుత్వ పరువు, పార్టీ పరువు పోయిందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. సెప్టెంబర్‌లోనే ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించిన తరువాత పేరూరు పంచాయతీలో ఎస్టీ మహిళా ఓటర్ ఒక్కరు కూడా లేరని, రిజర్వేషన్ మార్చాలని గ్రామస్తులు అధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యేను కల సి వినతిపత్రం అందజేశారు.
ఎమ్మెల్యే, అధికారులు పెడచెవిన పెట్టడంతో గ్రామ పంచాయతీ రిజర్వేషన్ మారలేదు, దీం తో గ్రామస్తులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్పంచ్ ఎన్నిలను బహిష్కరించే వరకు వెళ్లారు. గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించిన తరువాత అధికార పార్టీ నేతలు గ్రామస్తులకు ఏమి సమాధానం చెప్పలేక ఇప్పుడు తలలపట్టుకుంటున్నారు.