నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన లో కొందరు అధికారులు, ఉద్యోగులది ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోం ది. వారిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా..ఎన్ని విమర్శలు వచ్చినా.. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా ‘ఐ డోంట్ కేర్’ మాకు రావాల్సిన పర్సంటేజీలు ఇ వ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు.
నీలగిరి, నవంబర్ 23 : ఇటీవల నల్లగొండ జిల్లా జనరల్ దవాఖానలోని పరిపాలనా విభాగంలో ఇద్దరిపై పలు ఆరోపణలు వచ్చాయి. స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిపై విచారణ చేసి ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలను పక్కన బెట్టిన అధికారులు ఏమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తూ దవాఖాన ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ వసూళ్ల పర్వాన్ని మాత్రం ఆపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఓ పక్క శానిటరీ, సెక్యూరిటీ, ఇతర కార్మికులు జీతాల కోసం ధర్నా చేస్తున్నా… బిల్లులు సమర్పించడంలో, ఇతర అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నట్లు అరోపణలు వస్తున్నాయి. చిరు ఉద్యోగులైన అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వచ్చేదే చాలీచాలని వేతనమైనా కమీషన్ ఇవ్వాల్సి వస్తోంది. విషయాన్ని బయటికి చెబితే ఎకడ ఉద్యోగం నుంచి తొలగిస్తారోననే ఆందోళనతో వేతనాల్లో కోత పెడుతున్నా మిన్నకుండిపోతున్నారు.
జిల్లా జనరల్ దవాఖానలో పైసా లేనిదే పని జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేసి ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నివేదిక సమర్పణకు కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి వివరణగానీ, మెమోలుగానీ జారీ చేయలేదు. వారిన పిలిచి ఏం జరిగిదంటూ విచారణ చేయలేదు. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా విచారణ చేయకపోవడంతో ఉన్నతాధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులను కాపాడేందుకు ఉన్నతాధికారులు కలెక్టర్ ఆదేశాలను తొక్కిపెట్టినట్లు సమాచారం. దవాఖానలో అవినీతి, అక్రమాలపై దృష్టి సారించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఫైళ్లు పెండింగ్‌లో ఉంటే కిందిస్థాయి అధికారులను, ఉద్యోగులను ప్రశ్నిస్తే పెండింగ్ వెనుక తతంగం బయట పడే వీలుంటుందని సహ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సరైన సమయంలో మందులు, శానిటేషన్ వస్తువులు సరఫరా కావాలంటే ఫైల్స్‌ను త్వరితగతిన పరిషరించాలి. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు ఫైల్‌ను తొకిపెట్టి ముడుపులు అందాక క్లియర్ చేస్తున్నానే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పలు విభాగాల్లోని రోగులు ఇబ్బందులు ఎదురొంటున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు కూడా కమీషన్ ఇవ్వనిదే బిల్లు చేయమని చెబుతున్నట్లు సమాచారం. ఇటీవలే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ రెన్యూవల్ లేదా నూతన కాంట్రాక్టుకు సంబందించి ఉద్యోగుల వేతనాల చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగిని విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఇతర విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.
ముడుపులు ఇస్తేనే జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలోని అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఫైళ్లు కదులుతున్నాయనే చర్చ సాగుతోంది. ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపు ఆలస్యమవుతున్న నేపథ్యంలో తెచ్చిన అప్పులకు వడ్డీలకే సరిపోతోందని, బిల్లుల కోసం సంబంధిత సెక్షన్లో ముడుపులు ఇస్తేనే ఫైల్ కదులుతోందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. శానిటేషన్, అవుట్సోర్సింగ్, డైట్, డ్రగ్స్ సర్జికల్, ఇంప్లాంట్స్ బిల్లుల చెల్లింపుల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో బిల్లుల చెల్లింపు ఫైల్స్‌పై సంతకం కోసం ముడుపులు తీసుకుంటూ ఓ ఉన్నతాధికారి ఏసీబీకి పట్టుబడినా.. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో మార్పు రాకపోవడం గమనార్హం. ఈ సెక్షన్లో ఇద్దరు ఉద్యోగులు అవినీతిపై ఇటీవల రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి, జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వీరిపై గతంలో కూడా అవినీతి ఆరోపణలున్నాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కాంట్రాక్ట్ ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సెక్షన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముడుపులు ఇవ్వని ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్లకు చెందిన ఫైళ్లను రోజులు, నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నట్టు తెలిసింది. ఈవిషయమై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ కుమారిని వివరణ కోసం ప్రయత్నం చేయగా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.