నాటి కేసీఆర్ పాలనలో రైతుపై ప్రేమతో సకలం సమకూరిస్తే… నేటి కాంగ్రెస్ పాలనలో పాలకులు రైతులంటేనే కపట ప్రేమ కనపరుస్తున్నారు. ప్రతీ సీజన్లోనూ రైతుబంధు కోసం మొదలయ్యే ఎదరుచూపులు అన్ని దశల్లోనూ తప్పడం లేదు. సకాలంలో రైతుబంధు రాదు… సాగునీరు సరిగ్గా అందదు… కరెంటు కోతలు తప్పవు… చివరకు పంట అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరు. దీంతో రైతులు వెతలు అన్నీ కావు. ప్రస్తుత యాసంగి సీజన్లో మార్చి మూడో వారం నుంచే వరి కోతలు మొదలయ్యాయి. ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. అయినా నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల జాడేలేదు. ఇప్పటికే గతంలో ఏర్పాటు చేసిన స్థలాల్లోనే కేంద్రాలు ప్రారంభించకపోతారా అన్నట్లు రైతులు ధాన్యం తెచ్చి కుప్పలు పోసి ఎదరుచూస్తున్నారు. పక్షం రోజుల నుంచే రైతులు ధాన్యం కేంద్రాలకు వడ్లు తెచ్చి కుప్పలు పోశారు. కానీ నేటికి అధికారికంగా ఒక్క క్వింటాలు ధాన్యం కూడా కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. అసలే అకాల వర్షాల కాలం కావడంతో రైతులు బిక్కుబిక్కుమంటూ ధాన్యం కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్4(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా లో గతంలో మాదిరిగానే ఈ సారిగా కూడా 375 ధా న్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే వీటి ద్వారా అటుఇటుగా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరపాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వీటిల్లో ఈ నెల 2న చిట్యాల మండలం వట్టిమర్తిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లాలోనే తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ కూడా నేటికీ ధాన్యం కొనుగోళ్లు మాత్రం ప్రారంభం కాలేదు. ఇక ఇలాగే జిల్లావ్యాప్తంగా నేటికీ ఎక్కడా కొనుగోలు కేంద్రాల ప్రారంభించలేదు.
అయితే కేంద్రాల ప్రారంభానికి జిల్లా అధికారులు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టైమిం గ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 6న జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా కొనుగోలు కేంద్రాల ప్రారంభించనున్నట్లు అధికారులు చెప్తున్నారు. అంతకుముందూ కేసీఆర్ పాలనలోనూ ప్రతియేటా మార్చి మూడో వారం నుంచే కేంద్రాలను తెరిచేవారు. గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సీజన్లో జిల్లా ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగంతో ప్రారంభంలోనే ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేసేవారు. కానీ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ధాన్యం కొనుగోళ్లపై ఏ మాత్రం శ్రద్ద
లేదని స్పష్టం అవుతుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డే పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నా…. ధాన్యం కొనుగోళ్లపై చిత్తశుద్ధి కొరవడింది.

పక్షం రోజుల ఆలస్యం
గత యాసంగిలో నల్లగొండ జిల్లాలో మార్చి25 వ తేదీ నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కానీ ఈ సీజన్లో నేటికీ కేంద్రాల అడ్రస్సు లేవు. జిల్లా మంత్రులతో పాటు అధికారుల సైతం ధాన్యం కొనుగోళ్లను సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు. కానీ రైతుల మాత్రం కోసిన ధాన్యాన్ని కోసినట్లు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. గతంలో కేంద్రాలు ఏర్పాటు చేసిన స్థలాల్లో ధాన్యం రాశులు పోస్తున్నారు. ఎండలతో వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో తేమ శాతం కూడా ఇబ్బంది లేదు. త్రిపురారం మండలంలో ఏడు కేంద్రాల ప్రారంభం కావాల్సి ఉండగా ఒక్కటీ కాలేదు. ఇక్కడ ప్రస్తుతం త్రిపురారం, రాగడప, మాటూరు, డొంకతండా, చెన్నాయిపాలెం, బాబాసాయిపేటలో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి.
వేములపల్లి మండలం ఆమనగల్లులోనూ ధాన్యం కుప్పలుగా పేరుకుపోయాయి. తిప్పర్తి మార్కెట్ యార్డుతో పాటు ఇతర కేంద్రాలకు ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున ధాన్యం తెచ్చి ఎదురుచూస్తున్నారు. దామరచర్ల మార్కెట్ యార్డు ధాన్యంతో నిండిపోగా మండలంలోనూ చాలా కేంద్రాల్లో ధాన్యం ఇప్పటికే రాశులు పేరుకుపోయాయి. శాలిగౌరారంలోనూ ధాన్యం కుప్పులతో రైతులు ఎదురుచూస్తున్నారు. నార్కట్‌పల్లి, కనగల్, కొండమల్లేపల్లి, గుడిపల్లి, నాంపల్లి, నల్లగొండ, మాడ్గులపల్లి, దేవరకొండ, హాలియా, తిర్మలగిరిసాగర్, నకిరేకల్, కేతపల్లి తదితర మండలాల్లోని పలు కేంద్రాల వద్దకు వారం రోజుల కిందట నుంచే ధాన్యం రాక మొదలైంది. కానీ నేటికీ ఎక్కడా ఒక్క చోట కూడా కోనుగోళ్లు ప్రారంభం కాలేదు.

రైసుమిల్లర్లతోనూ సమస్యే..
కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం జిల్లాలోని రైసుమిల్లలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే కేంద్రాల వారీగా ముందే రైసుమిల్లులను కేటాయించి అక్కడికే ధాన్యాని తరలిస్తారు. అయితే ఈ సీజన్లో నేటికి రైసుమిల్లర్స్తో చర్చలు కొలిక్కి రాలేదని తెలిసింది. ఈ సారీ కేంద్ర ప్రభుత్వం కేవలం రా రైస్ మాత్రమే తీసుకుంటామని నిబంధన పెట్టింది. అయితే రా రైస్ అయితే తమకు నష్టం వస్తుందని రైసు మిల్లర్ల వాదన. ఎప్పటిలాగే బాయిల్ ్డరైస్ ఇస్తామని రైసు మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. యాసంగిలో రా రైస్ ఇవ్వాల్సి వస్తే నూక శాతం ఎక్కువై నిబంధనల మేరకు క్వింటాల్‌కు ఇవ్వాల్సిన బియ్యం పరిమాణాన్ని ఇవ్వలేమని రైసు మిల్లర్లు చెప్తున్నారు. రా రైస్‌తో తమకు ఏ మాత్రం గిట్టుబాటు కాదని, ఈ యాసంగిలో బాయిల్డ్ రైసే తీసుకోవాలని కోరుతున్నారు.
అయితే దీనిపై అధికారులు మిల్లర్లపై ఒత్తిడి తెచ్చి కొనేలా ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా కొలిక్కి రాలేదని తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకుంటే తప్ప, త్వరగా కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. ఇది కొలిక్కి వస్తే రైసు మిల్లల కేటాయింపు, ధాన్యం తరలింపునకు లారీల ఏర్పాటు వంటి వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే ఇవన్నీ కొలిక్కి వచ్చి గాడిలో పడే సరికి మరో పక్షం రోజులైనా పట్టవచ్చని అంచనా. పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కావాలంటే ఇంకో రెండు వారాల ఎదురుచూపులు తప్పకపోవచ్చని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇంత అలస్యమైతే వాతావరణం ఎప్పుడు ఎలా మారుతోంది అర్ధం కాని సీజన్ ఇది. అకాల వర్షాలు, వడగండ్ల వానల ముప్పు ఉండనే ఉంది. వీటన్నింటి నేపథ్యంలో తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
