నీలగిరి, ఆగస్టు 07 : తల్లి పాల ప్రాముఖ్యతను ప్రతి గర్భిణికి వివరించి బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాగించేలా చూడాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని ఆర్థాలబావి ఆంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బాలింతలు, గర్భిణీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చిన్నారుల వయస్సు, బరువు, ఎత్తు కొలతలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు పుట్టిన గంటలోపే ముర్రుపాలను పట్టించడం, 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఉండడంతో పాటు వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుందన్నారు. 8 నెలలు నిండిన తర్వాత అదనపు ఆహారం అందిస్తూ రెండు సంవత్సరాల వరకు తల్లి పాలు పట్టించాలన్నారు. చిన్నారులకు పోషక ఆహారాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పార్వతి, అంగన్వాడీ టీచర్ ఖుర్షీదా బేగం పాల్గొన్నారు.
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా నల్లగొండ పట్టణంలోని శివాజీనగర్ ఆంగన్వాడీ కేంద్రం పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ ప్రకృతాంబ తల్లిపాల ప్రాముఖ్యతను గర్భిణీలు, బాలింతలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా సుకన్య తల్లులు సరిత, మౌనిక, సులోచన, శ్వేత, లావణ్య, నీలవేణి, పద్మ, సంధ్యారాణి పాల్గొన్నారు.
Nalgonda : పుట్టిన బిడ్డకు గంటలోపే ముర్రుపాలు తాగించాలి : సీడీపీఓ నిర్మల