రామగిరి, మే 14 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి కొత్త వైస్ చాన్స్‌లర్ ఎవరనేది సందిగ్ధంలో ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 22 మే, 2021న పలు యూనివర్సిటీలకు నూతన వీసీలను అప్పటి సర్కార్ నియమించింది. వారి పదవీకాలం ఈ నెల 21తో ముగియనున్నది. రాష్ట్రంలో ఉన్నత విద్యా నిలయాలైన యూనివర్సిటీలకు సకాలంలో వీసీల నియామకం చేపట్టాలనే ఉద్దేశంతో సర్కార్ ఆదేశాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి-విద్యాశాఖ ఈ సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది.
దాంతో ఆశావహులైన సీనియర్ ప్రొఫెసర్లు దరఖాస్తులను సమర్పించారు. ఎంజీయూకు ప్రస్తుత వీసీ చొల్లేటి గోపాల్‌రెడ్డి మే 24, 2021న బాధ్యతలు స్వీకరించారు. గడువు ముగిసేలోగా నూతన వీసీలను నియమించేలా అటు సర్కార్, ఇటు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండటంతో వీసీల నియమకానికి ఇబ్బందులు లేకుండా అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసినట్లు సమాచారం. ఈసీ ఆమోదం తెలిపితే గడువులోపు కొత్త వీసీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వీసీల నియామకానికి జనవరిలో నోటిఫికేషన్ జారీకాగా ఎంజీయూలో ముందస్తు ప్రణాళికలతో దరఖాస్తులు స్వీకరించారు. సుమారు 157మంది సీనియర్ ప్రొఫెసర్లు తమ అర్హత పత్రాలతో దరఖాస్తులు చేశారు. దరఖాస్తులను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో స్క్రూటినీ చేసి సర్కార్‌కు పంపించారు. 70 ఏండ్లు దాటిన వారు కూడా వీసీ పోస్టుకు దరఖాస్తు చేయడంతో 65 ఏండ్ల వరకే కటాఫ్ పెట్టాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తుంది.
వీసీల నియామకాల్లో అర్హులైన వారితో జాబితా సిద్ధం చేసేందుకు ఒక్కొక్క వర్సిటీకి సెర్చ్ కమిటీలను సర్కార్ నియమించింది. వీటిలో యూజీసీ నామినీతోపాటు వర్సిటీ నామినీ, సర్కార్ నామినీ ఉంటారు. ఈ కమిటీ సమావేశాలు నిర్వహించి నూతన వీసీ ఎంపిక అర్హుల జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి వస్తే సెర్చ్ కమిటీలు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నది.