గతంలో ప్రధాన పట్టణాలు, వాటికి ఆనుకుని ఉండే కొన్ని గ్రామాలతోనే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(యూడీఏ) ఏర్పాటు చేసేవారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఒక్కో జిల్లాను ఒక్కో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకు తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం వెలువరించిన ఉత్తర్వుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాను మూడు అర్బన్ అథారిటీలుగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నల్లగొండ కేంద్రంగా గత కేసీఆర్ సర్కార్ నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నుడాను నల్లగొండ జిల్లా అంతటా విస్తరిస్తూ తాజాగా ఆదేశిలిచింది. ఇక సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలకు కొత్తగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది. అయితే ఉన్నట్టుండి జిల్లాలకు జిల్లాలనే ఇందులో చేర్చడం వల్ల అదనంగా చేకూరే ప్రయోజనాలు ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
– నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్29(నమస్తే తెలంగాణ)
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించి, అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ప్రధాన పట్టణాలను అభివృద్ధ్ది చేసేందుకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని గత ప్రభుత్వాలు తెరపైకి తెచ్చాయి. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోకి తీసుకువచ్చి అభివృద్ధిని విస్తరించిన తరహాలోనే రాష్ట్రంలోని ఇతర ప్రధాన పట్టణాలకు సైతం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం వరకు రాష్ట్రంలో 9 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు రూపుదిద్దుకున్నాయి. ఇందులో ఉమ్మడి జిల్లాలోనూ నల్లగొండ జిల్లా కేంద్రంగా నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా)ను కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసింది.
2022 జనవరి 31న జీఓ నంబర్ 16 ద్వారా నుడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పుడు నల్లగొండ మున్సిపాలిటీతోపాటు నల్లగొండ మండలంలోని 22 గ్రామాలు, కనగల్‌లోని 6 గ్రామాలు, తిప్పర్తిలోని 9, కట్టంగూర్‌లో 1, నార్కట్‌పల్లిలో 2, నకిరేకల్‌లోని 2 గ్రామాలతో 540 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో నుడా రూపుదిద్దుకుంది. నుడా పరిధిలో నిధుల సమీకరణ కోసం బెటాలియన్‌కు ఎదురుగా ఉన్న రాజీవ్ స్వగృహ స్థలాన్ని అభివృద్ధి చేసి వేలం వేశారు. ఇక ఇదే సమయంలో నల్లగొండ అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం విస్తృతంగా నిధులిచ్చి ప్రోత్సహించింది.
నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, నల్లగొండగా నుడాను విస్తరిస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం ఉత్వర్వులు ఇచ్చింది. నల్లగొండ నుడా పరిధిలోకి గతంలో ఉన్న 42 గ్రామాలతోపాటు అదనంగా 502 గ్రామాలను ఇందులో చేర్చింది. దీంతో మొత్తం జిల్లా పరిధిలోని 544 గ్రామాలు నుడా పరిధిలోకి వచ్చినైట్లెంది. జిల్లా పరిధిలో ఇప్పటికే ఉన్న నల్లగొండతోపాటు మిగతా మిర్యాలగూడ, నకిరేకల్, చిట్యాల, చండూరు, హాలియా, నందికొండ, దేవరకొండ మున్సిపాలిటీలకు విస్తరిస్తూ 32 మండలాల్లోని మేజర్ గ్రామాలన్నింటీని ఇందులోకి తీసుకొచ్చారు.
జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు కాగా మరో 300 గ్రామాలు మాత్రమే నుడా పరిధిలోకి రాకుండా ఉన్నాయి. చందంపేట మండలంలోని కంబాలపల్లి గ్రామాలను సైతం నుడా పరిధిలోకి తీసుకురావడం గమనార్హం. నుడా, నల్లగొండ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
సూర్యాపేట జిల్లాలోని 23 మండలాలతోపాటు ఐదు మున్సిపాలిటీలతో కలిపి సూర్యాపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలతో పాటు అన్ని మండలాల పరిధిలోని 264 మేజర్ గ్రామాలను సుడా పరిధిలోకి తీసుకువచ్చారు. ఇక్కడ మొత్తం 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరో 222 గ్రామాలను మాత్రం సుడా పరిధిలోకి తీసుకోలేదు.
గతంలో ఈ జిల్లాలో ఎలాంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేదు. కొత్తగా సుడాగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా యాదాద్రిభువనగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(యూడా)ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇప్పటికే పలు మున్సిపాలిటీలు గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉండగా తాజాగా ఆలేరు, మోత్కూర్ మున్సిపాలిటీలతోపాటు 144 గ్రామాలను యుడా పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ జిల్లాలోని తుర్కపల్లి, సంస్థాన్ నారాయణపురం మండలాలను మాత్రం ప్రస్తుతానికి వదిలేశారు. త్వరలోనే ఈ మండలాలను సైతం హెచ్ఎండీఏ పరిధిలో చేర్చే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
ఇప్పటికే జిల్లా యూనిట్‌గా అభివృద్ధి నమూనాలు అమలులో ఉండగా తాజాగా ఏర్పాటు చేస్తున్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలతో ప్రయోజనాలు ఏంటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మున్సిపల్, గ్రామ పంచాయతీల అధికారాలకు కత్తెర పడనుందానన్న అనుమానాలు మొదలయ్యాయి. బిల్డింగ్ పర్మిషన్లు, లేఅవుట్ల అనుమతులన్నీ ఇక ముందు అథారిటీలకు అప్పజెప్పితే తమ ప్రాంతాల అభివృద్ధికి నిధుల పరిస్థితి ఏంటన్నది సందేహాస్పదంగా మారనుంది. గతంలో ప్రధాన పట్టణాల అభివృద్ధి కోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ద్వారా భవిష్యత్తు అవసరాలు, పట్టణ విస్తరణను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేవారు. దీని ద్వారా ప్రణాళిక బద్ధంగా అభివృద్ధికి ఆస్కారం కలిగేది.
దీంతో పాటు అథారిటీల పరిధిలోనే నిధులను సమకూర్చుకునే అవకాశాలు ఉండేవి. దీంతో పాటు బిల్డింగ్ పర్మిషన్లు, లేఅవుట్ల అనుమతులన్నీ కూడా అథారిటీల పరిధిలోకి వస్తాయి. అయితే అథారిటీ పరిధి కొంత మేరకు అయితేనే ప్రత్యేకంగా అభివృద్ధికి ఆస్కారం ఉండేదన్న చర్చ ఉంది. కానీ ప్రస్తుతం జిల్లా అంతటికీ దీని పరిధిని విస్తరించడం వల్ల అభివృద్ధి పరంగా కొత్తగా ఏర్పడే అవకాశాలు ఏంటన్నది తేలాల్సి ఉంది. ఇప్పటివరకు 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు గ్రామ పంచాయతీల పరిధిలోనే అనుమతులు ఇస్తున్నారు. ఆపైన బిల్డింగ్లు, లేవుట్లకు అనుమతులు మాత్రం డీటీసీపీ నుంచి తీసుకుంటున్నారు. ఇక ముందు ఇది ఇలానే కొనసాగుతుందా? అన్ని అనుమతులు అథారిటీల పరిధిలోకి వస్తాయా? వస్తే స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపులు ఎలా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.