నల్గొండ విద్యా విభాగం, (రామగిరి) మార్చి 12 : మహాత్మా గాంధీ యూనివర్సిటీని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది అభివృద్ధి చేసేందుకు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 2025- 26 విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీలో నూతన కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిని ఉన్నత విద్యా మండలికి సమర్పించడంతో నిర్వహణ అంశానికి అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాలను పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాలతో కమిటీ సభ్యులు ప్రొఫెసర్ విద్యాధర్‌రెడ్డి నేతృత్వంలో ప్రొఫెసర్ బాలకృష్ణతో పాటు ఆయా విభాగంలో నిపుణులైన ప్రొఫెసర్ల ప్రత్యేక బృందం బుధవారం ఎంజీయూను సందర్శించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ లోని సమావేశ మందిరంలో తొలుత సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి పంపిన నివేదికలను బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీసి ఖాజా అల్తాప్ హుస్సేన్ వివరించారు.
యూనివర్సిటీ అభివృద్ధికై చేపట్టిన నివేదికల ఆధారంగా ఆయా అంశాలను పరిశీలన బృందంలోని సభ్యులు ప్రొఫెసర్ విద్యాధర రెడ్డి నేతృత్వంలో ప్రొఫెసర్ బాలకృష్ణ, ప్రొఫెసర్ మృణళిని, ప్రొఫెసర్ శోభారాణి కమిటీ బృందం యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్, సైన్స్ కళాశాల, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల, పానగల్‌లోని యూనివర్సిటీ కళాశాలలను ప్రత్యక్షంగా తనిఖీ చేసి పరిశీలన చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బీఈడీ, ఎంఈడి, బిపిఈడి, ఎంపిఈడి, ఎంఏ గవర్నర్స్ అండ్ పబ్లిక్ పాలసీ, ఎంఏ డెవలప్మెంటల్ స్టడీస్, బీఫార్మసీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు, అందుకు తగిన అధ్యాపక పోస్టులు, కళాశాల భవనాలకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి బృందం సభ్యులు సీల్డ్ కవర్లో అందించనున్నట్లు తెలిపారు.
నల్లగొండ జిల్లా నిరుద్యోగ యువతకు సహాయకారిగా నైపుణ్యాభివృద్ధి కొరకు సంస్థ ఏర్పాటుకు, సెల్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ బడ్జెట్ కోర్సులుగా మార్పునకు ప్రతిపాదనలు అందించినట్లు వివరించారు. మొత్తం భవనాల నిర్మాణం, అధ్యాపక నియామకాలకై ప్రభుత్వానికి నివేదించినట్లు, వివిధ భవనాల నిర్మాణానికి మొత్తం 309. 65 కోట్ల రూపాయల ప్రతిపాదనలు అందించినట్లు తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రతిపాదనలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఇన్స్పెక్షన్ కమిటీ ప్రొఫెసర్ విద్యాధర రెడ్డి నేతృత్వంలో విశ్వవిద్యాలయాన్ని సందర్శించి వారి ప్రతిపాదనలను కూలంకుశంగా పరిశీలించి, అందుబాటులో ఉన్న సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించి నివేదికను రూపొందించారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, ఓ ఎస్ డి ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి. ఉపేందర్ రెడ్డి, ఐక్య సి డైరెక్టర్ డాక్టర్ మిర్యాల రమేష్ కుమార్, హాస్టల్స్ డైరెక్టర్ డా. దోమల రమేశ్, ఆడిట్ సెల్ డైరెక్టర్ డా. వై ప్రశాంతి, కళాశాలల ప్రిన్సిపాల్ లు సుధారాణి, డా కే. ప్రేమ్ సాగర్, అరుణ ప్రియ, వివిధ విభాగాల అధ్యాపకులు, శ్రీదేవి, రేఖ, హరీష్ కుమార్ పాల్గొన్నారు.