యాదగిరిగుట్ట, మే 9: దేవస్థాన అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేని తనంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి నైవేద్య, ప్రసాదాల తరలింపులో ఇబ్బందులు తప్పడం లేదు. హెడ్రాలిక్ లిప్టు ఏడాదిగా పనిచేయకపోవడంతో స్వామివారికి నిత్యం సమర్పించే మహారాజ భోగాలు, నైవేద్యానికి తరలింపు సమయంలో అర్చకులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారికి ఆరగింపు ప్రసాదాలను చేరవేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన లిప్టు చెడిపోవడంతో సిబ్బంది ప్రసాదాలను మోసుకుంటూ మెట్ల మార్గం ద్వారా స్వామివారి గర్భాలయంలోకి వెళ్లాల్సి వస్తోంది. భక్తులు నడిచిన దారిలోనే ఆరగింపు ప్రసాదాలను తీసుకువెళ్లడం అపచారమనని, స్వామివారిని అవమానపరిచినట్లేని అర్చకులు, పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేసవి కాలంలో మండుటెండలను సైతం లెక్కచేయకుండా సుమారు 10 నుంచి 15 కిలోల బరువులతో మెట్లు దిగడం అర్చకులకు తలకుమించిన భారంగా మారింది. అర్చకుల ఇబ్బందులను చూసి భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికాలంగా ఈ సమస్య ఉన్నా ఇటీవల ఈ సమస్య మరింత తీవ్రమైందని, దేవస్థానం అధికారులు స్పందించకపోవడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నైవేద్యాల తరలింపులో జాప్యం జరిగితే.. ఆలయ దైనందిన కైంకర్యాలు, పూజా కార్యక్రమాల సమయపాలన గాడి తప్పుతున్నాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తుల వచ్చే ఇంత పెద్ద ఆలయంలో స్వామి వారికి అందజేసే నైవేద్యం తీసుకెళ్లే లిప్టుకు మరమ్మతులు చేయించలేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు వాపోతున్నారు.
భోజన ప్రియుడు..
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారు భోజన ప్రియులు. ఉదయం దద్దోజనం, మధ్యాహ్నం పులిహోర, చక్కెర పొంగలి, వడ, సుండెలు, దోశలు సేవిస్తారు. మధ్యాహ్నం లడ్డూ, వడలు, పులిహోర, చక్కెరతో సిద్ధం చేసిన ప్రసాదంతో పాటు రాజభోగం వివిధ రకాల కూరగాయలు, అన్న ప్రసాదాలు ఆరగిస్తారు. సాయంత్రం అరగింపులో భాగంగా పులిహోర, సుండెలు, దోశలు, వడపప్పు, పానకం వంటి వివిధ రకాల నైవేద్యాలను అర్చక స్వాములు వడ్డిస్తారు. శుక్రవారం ప్రత్యేకంగా క్షీరాన్నం స్వామివారికి అందజేసే సంస్కృతిని ఆలయ అర్చకులు కొనసాగిస్తున్నారు. దీంతో పాటు భక్తుల మొక్కు సేవలో భాగంగా వివిధ రకాల భోగాలను స్వామివారికి అందజేస్తారు. ఈ నైవేద్యాలను స్వామివారి ప్రధానాలయంలోని ద్వితీయ ప్రాకారం వెలుపలి భాగంలో ఆగ్నేయ దిశలో ప్రత్యేకమైన రామానూజ కూటంలో స్వామివారి అగ్నితో సిద్ధం చేశారు. ఈ భోగాలను అత్యంత నిష్ఠతో వంట స్వాములు, పరిచారకులు సిద్ధం చేస్తారు. స్వామివారికి అభిరుచికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ప్రసాదాల తయారీలో అత్యంత కౌశలం ప్రదర్శిస్తారు. పాంచరాత్రగమశాస్త్రం అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా కైంకర్యాలు చేపడతారు. రామానూజ కూటమిలో సిద్ధమైన నైవేద్యాలను ప్రత్యేకంగా సిద్ధం చేసిన లిప్టు ద్వారానే స్వయంభూ గర్భాలయంలోకి తీసుకెళ్తారు. మొదటగా గర్భాలయం శుద్ధి చేసిన అనంతరం ఆరాధన చేపడతారు. తరువాత స్వామివారికి గంటలోపే ఆరగింపు సేవ చేపడతారు.
2022లోనే హైడ్రాలిక్ లిప్టు..
దేవస్థాన పునర్నిర్మాణంలో భాగంగా యాదగిరిగుట్ట దేవస్థాన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ లిప్టులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో పాటు స్వామివారి ఆరగింపు నైవేద్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకెళ్లేందుకు స్వామివారి ప్రధానాలయంలోని ప్రత్యేకంగా లిప్టును నిర్మించగా మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా 2022 మార్చి 28న అందుబాటులోకి వచ్చింది. రామానూజ కూటమికి ఎదురుగానే ప్రత్యేకంగా సిద్ధం చేసిన హైడ్రాలిక్ లిప్టు గుండా నేరుగా స్వామివారి గర్భాలయం పక్కకు ప్రసాదాలు చేరుకుంటాయి. అక్కడి నుంచి భక్తులు తిరిగేందుకు తావులేని ప్రాంతం గుండా పది అడుగుల దూరంలో గర్బాలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి ఆరగింపు సేవ చేపడతారు. స్వామివారి ఆరగింపు శాస్త్రబద్ధంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా, సరైన సమయంలోనే పూర్తి చేస్తారు. ఈ లిప్టును కేవలం అర్చకులు, స్వామివారికి వినియోగించే అరగింపు ప్రసాదాలను తరలించేందుకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధి త అధికారులు స్పందించి సత్వరమే చర్యలు చేపట్టి త్వరితగతిన హైడ్రాలిక్ లిప్టును అందుబాటులోకి తేవాలని స్థాని కులు, భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.