నీలగిరి, మే 30 : ప్రజా సమస్యల పరిషారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతోపాటు గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జడ్పీ ఒకటవ, రెండవ, మూడు, నాలుగు, ఏడవ స్థాయీసంఘాల సమావేశాలు చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు అధ్యక్షతన వేర్వేరుగా జరిగాయి. ఈ సమావేశాల్లో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, విద్య, వైద్యం, ఉద్యానవన, వ్యవసాయ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఖాదీ రుణాలతోపాటు ఆయా శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అభివృద్ధి పనులు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సభ్యులు ఎండగట్టారు. పెండింగ్ బిల్లుల మంజూరు, అభివృద్ధి పనులు పూర్తి చేయకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. దీనిపై అధికారుల నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో జడ్పీ చైర్మన్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి గైర్హాజరైన వివిధ శాఖల అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సమస్యల పరిషారంలో అధికారుల నిర్లక్ష్యం సరికాదన్నారు. ఇప్పటికైనా పనులను త్వరగా పూర్తి చేసి పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని అధికారులకు సూచించారు. సమావేశాల్లో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జడ్పీ సీఈఓ ఎన్.ప్రేమ్‌కరణ్‌రెడ్డి, జడ్పీటీసీలు వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్ల వెంకటేశం, స్వర్ణలత, లలిత, సరిత, సూర్య భాషానాయక్, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.