దేవరకొండ, మే 13 : దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ ఘటన అత్యంత దురదృష్టకరం అని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నాపత్రం లీకై ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. పగలూ రాత్రి కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని ఆయన దుయ్యబట్టారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీకైందన్నారు. 2024 లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైంది అని ఆయన గుర్తు చేశారు.
జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత విద్యార్థుల పట్ల శాపంగా మారిందన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కేంద్ర సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అలాగే సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలన్నారు. నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలన్నారు.