చివ్వెంల, జూన్ 17 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన మంద బలంతో తెచ్చిన లేబర్ కోడ్లను తిప్పి కొట్టేందుకు జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ సూర్యాపేట జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం చివ్వెంల మండల కేంద్రంలోని సివిల్ సప్లయ్ గోదాం వద్ద హమాలీ కార్మిక నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటీష్ కాలంలో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లను తేవడం వల్ల కార్మిక హక్కులను హరించి వేస్తున్నారన్నారు.
దేశంలో ఎగుమతి, దిగుమతి చేస్తున్న ప్రభుత్వ రంగంలోని సివిల్ సప్లయ్ హమాలీ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లయ్ రంగంలో పని చేస్తున్న హమాలీ కార్మికులకు ఆరోగ్య బీమా, పని భద్రత, ప్రమాద బీమా పథకాలను వర్తింప చేయాలని కోరారు. జులై 9న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో 10 కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. సమ్మెలో జిల్లాలోని ప్రతి ఉద్యోగ, కార్మిక, అసంగిటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధ్యక్షుడు ఏర్పుల అమ్మయ్య, యేసు, నాగరాజు, వెంకన్న, వరుణ్, గోపాల్ దాస్, శ్రీరాములు పాల్గొన్నారు.