తీరొక్క ఆటోమొబైల్ కంపెనీలను ఒక్కచోటకు చేర్చి నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ఆటో షోకు తొలిరోజు విశేష స్పందన లభించింది. రెండ్రోజుల ప్రదర్శనను జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా శనివారం ఉదయం హాజరై ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి సందర్శకులు తరలివచ్చారు. సాధారణంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో మాత్రమే నిర్వహించే ఆటోషోను నల్లగొండ పట్టణంలో మొట్టమొదటిసారి నిర్వహించడంపై సంతోషం వ్యక్తంచేశారు. ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకుని వాహనాలు కొనుగోలు చేశారు. ప్రముఖ వాహన కంపెనీలు, ఫైనాన్స్ సదుపాయం అందించేందుకు బ్యాంకులు ఒకే ప్రాంగణంలో ఉండడం కొనుగోలుదారులకు కలిసివచ్చింది. సందర్శకులు సైతం లక్కీడ్రాలో బహుమతులను అందుకున్నారు. ఆదివారం రాత్రి 8గంటల వరకూ ఆటో షో కొనసాగనున్నది. చివరి రోజు మెగా డ్రాలో విజేతకు నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే దినపత్రికలు మొబైల్ ఫోన్ అందించనున్నాయి.
నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో టీ న్యూస్ మీడియా పార్ట్నర్గా నల్లగొండ నాగార్జున డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించిన ఆటో షోకు భారీ స్పందన లభించింది. రెండ్రోజుల పాటు నిర్వహించే ఈ షోలో తొలి రోజు శనివారం 19 ఆటోమొబైల్ కంపెనీలు, కార్లు, బైక్‌లు, ట్రాక్టరు, వ్యవసాయ పరికరాల స్టాల్స్ ఏర్పాటు చేశాయి. అన్ని కంపెనీల కొత్త మోడల్ వాహనాలు ఒకేచోట కొలువుదీరడంతో బయ్యర్లు, విజిటర్లు పెద్ద సంఖ్యలో సందర్శించారు. అన్ని రకాలు బైకులు, కార్ల మోడల్స్ చూసి ధరలు, ఫీచర్ల గురించి తెలుసుకున్నారు. తమకు నచ్చిన వాహనాలను బుక్ చేసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు తరలివచ్చిన విజిటర్స్‌తో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.
ఆటో షోతో ఆఫర్లను ఎక్కువ మందికి తెలియజేశాం
నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే ఆటో షో మా షోరూమ్‌లోని కార్లపై ఉన్న ఆఫర్లను ఎక్కవ మందికి తెలియజేయకల్గినం. ఇయర్ ఎండింగ్ కావడంతో ప్రత్యేక ఆఫర్లు పెట్టాం. అదే షోరూంలో అయితే విజిటర్స్ రోజుకు 10 నుంచి 15 మంది వచ్చేది. ఈ ఆటో షోలో 60 నుంచి 80 మంది వచ్చి కార్ల ఆఫర్లు, టెక్నికల్ విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్క రోజే రెండు కార్లు సేల్ అయ్యాయి. నమస్తే తెలంగాణ ఇలా ప్రజలకు సర్వీస్ చేసే కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరం.
– నాగమణిరెడ్డి, పవన్ మోటార్స్ సేల్స్ జీఎం, నల్లగొండ
బైక్‌లపై ప్రత్యేక ఆఫర్లు
ఆటో షోకు వచ్చి హీరో బైకులు కొనుగోలు చేసే వారికి ప్రత్యేకంగా ఆఫర్లు పెట్టాం. గ్లామర్ బైక్‌పై రూ.5వేలు, హీరో స్కూటర్‌పై రూ.3 వేలు తగ్గింపు ఇస్తున్నాం. దాంతో షోలో రెండు బైకులు అమ్ముడుపోయాయి. ఒకే చోట అన్ని రకాల షోరూమ్లవి ఉండడంతో చాలా మంది వచ్చి బైక్‌ల గురించి తెలుసుకున్నారు. ఆటో షోలో మా బైక్‌లకు, ఆఫర్లకు మంచి ఆదరణ ఉంది.
– ఎస్.జలేందర్, హీరో వెంకటరమణ మోటార్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, నల్లగొండ
హోండా యాక్టివా తీసుకున్నా
నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షోలో విఘ్నేశ్వర హోండా మోటార్స్‌లో యాక్టివా 125 సీసీ వాహనం తీసుకున్నా. షోరూం ధర కంటే ఇక్కడ ఎనిమిది వేల రూపాయలు తక్కువగా వచ్చినందుకు సంతోషంగా ఉంది. పత్రికా సంస్థలు ఇలాంటి ఆటో షోలు నిర్వహించడం ఎప్పుడూ చూడలేదు. ఇది మంచి పరిణామం.
– ఖయ్యూం బేగ్, కౌన్సిలర్, నల్లగొండ
హోండా ఇమేజ్ కార్ తీసుకున్నాం
మాకు ఇప్పటికే ఒక చిన్న కారు ఉంది. పిల్లలు పెద్ద కారు తీసుకుందామని చాలా రోజుల నుంచి అంటున్నారు. ఈరోజు ఆటో షోలో కాస్త ధర తక్కువగా వస్తుందని కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాం. ప్రైడ్ హోండా వారి హోండా ఇమేజ్ కారు కొనుగోలు చేశాం. పది వేల రూపాయలు తగ్గించి ఇస్తున్నారు. ఎస్బీఐ ద్వారా ఫైనాన్స్ తీసుకుంటున్నాం. కారు బాగుండటంతో పిల్లలు ఇదే కావాలన్నందున కొన్నా.
– కె.రాంరెడ్డి, నాగార్జునసాగర్, నల్లగొండ
స్కోడా కారు గురించి ఎక్కువగా తెలుసుకున్నారు
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వారు ఇంత పెద్ద ఆటో షో పెట్టడం సంతోషకరం. మేము నల్లగొండ వంటి ప్రాంతంలో మొదటిసారిగా షోలో పాల్గొన్నాం. స్కోడా కారుకు ఈ షోలో మంచి ఆదరణ లభించింది. నల్లగొండ పట్టణం, పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు స్కోడా కారు టెక్నికల్ విషయాలు, ఫైనాన్స్, బ్యాంకు రుణాల గురించి అడిగి తెలుసుకున్నారు.
– అనిల్‌రెడ్డి, స్కోడా షోరూం సేల్స్ మేనేజర్, సోమాజిగూడ, హైదరాబాద్
పండుగలా ఆటో షో
ఆటో షోకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. షోరూంలోనైతే పండుగ రోజుల్లో, ఆఫర్లు పెట్టిన సమయాల్లో మాత్రమే ఇంత పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ షోలో విజిటర్స్ ఎక్కువగా నేరుగా వచ్చి అన్ని రకాల బైక్‌లు, టెక్నికల్ విషయాలు, ఫైనాన్స్, రుణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు రెండు బైకులు అమ్ముడుపోయాయి.
– కట్టెబోయిన సైదులు, విఘ్నేశ్వర హోండా షోరూం సేల్స్ టీం లీడర్, నల్లగొండ