Nallagonda | ఆత్మకూరు (ఎం), ఫిబ్రవరి 28 : రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజయ్య డిమాండ్ చేశారు. యాస బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 6వ మహాసభలో కొల్లూరి రాజయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. స్వామినాథన్ కమిటీ సూచన మేరకు అన్ని రకాల పంటలకు, ఆయా ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలన్నారు. రెండు మూడు ఎకరాలలోపు ఉన్న రైతులకు కొందరికి మాత్రమే రైతు భరోసా డబ్బులు పడ్డాయి. మరికొందరు రైతులకు రైతు భరోసా పడలేదు. దీనిపట్ల వ్యవసాయ అధికారులకు ప్రభుత్వం సూచనలిచ్చి వారికి కూడా రైతు భరోసా వచ్చేలా చూడాలని, షరతులు లేకుండా రైతులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పంటల బీమాను కల్పించాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు. బునాదిగాని కాలువ పనులు వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి జక్క దయాకర్ రెడ్డి, మండల కార్యదర్శి మరుపాక వెంకటేష్, రైతు సంఘం నాయకులు సోలిపురం లింగారెడ్డి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, బత్తిని లింగయ్య, మారుపాక యాదయ్య, కసరబోయిన సత్తయ్య, మారుపాక అంజయ్య, పంజాల ఆంజనేయులు, తాళ్లపల్లి నరసయ్య, భూతరాశి యాదగిరి , అంబోజు రాములు, బొక్క దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.