రామగిరి, ఆగస్టు 29 : నల్లగొండను ఎడ్యుకేషన్ హబ్‌గా మర్చడమే తన లక్ష్యమని రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్‌లో కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ఆధ్వర్యంలో రూ.3కోట్లతో నిర్మించనున్న బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవనానికి మంగళవారం ఆయన శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్నచూపు పోవాలన్నారు. 1952లో ప్రారంభమైన బొట్టుగూడ పాఠశాల ఎందరో మేధావులు, ఇంజినీర్లు, అధికారులు, డాక్టర్లను అందించిందని తెలిపారు.
బొట్టుగూడ పాఠశాలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విధంగా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.3కోట్లతో నూతన భవనం నిర్మిస్తామన్నారు. పదో తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ.50వేలు, 9.7 జీపీఏ వచ్చిన వారికి 30వేలు, 9.5 వచ్చిన వారి 20వేలు నగదు ప్రోత్సాహాన్ని సొంతంగా అందిస్తానని ప్రకటించారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని సాధన దిశగా కృషి చేయాలన్నారు. ఫిబ్రవరిలోగా పాఠశాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలను సెప్టెంబర్ 12న సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. నల్లగొండలో రూ.20కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తామని పేర్కొన్నారు. అనంతరం కనగల్ మండలం చిన్నమాదారంలో 33/11కేవీ సబ్‌స్టేషన్ పనులకు భూమి పూజ చేశారు. తిప్పర్తి మండలం కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చిరుత శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల విద్యుత్‌షాక్‌తో మృతి చెందగా, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
అంతకుముందు ఉదయం నల్లగొండలోని శ్రీనగర్‌కాలనీ పార్కులో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పరిష్కరించే దిశగా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. నల్లగొండ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డీఈఓ బి.భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, పాఠశాల ఎఫ్ఏసీ హెచ్ఎం శంకరయ్య, కనగల్‌లో ఆర్‌డబ్లూఎస్ అధికారి వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌కో ఎస్ఈ పాల్రాజు, ఆర్డీఓ రవి, కాంగ్రెస్ నేత గుమ్మలమోహన్రెడ్డి పాల్గొన్నారు.