రామగిరి, జూలై 16 : నల్లగొండ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో జనాభా అధికంగా ఉండటంతో ప్రజలు త్రీవమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నల్లగొండ తాసీల్దార్ కార్యాలయాన్ని అర్బన్ అండ్ రూరల్‌గా విభజించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో బుధవారం సీపీఎం నల్లగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షన్నర మందికి పైగా జనాభా ఉన్న నల్లగొండ మండలంలో వీఆర్ఓ, వీఆర్ఏల వ్యవస్థ లేకపోవడంతో కులం, ఆదాయం, జనన, మరణ ధ్రువప్రతాలు, భూమి సమస్యల పరిష్కారానికి ప్రజలు రోజూ గంటల తరబడి క్యూలలో నిలబడి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో పాలకులు ఇచ్చే వాగ్దానాలు అమలవడం లేదని విమర్శించిన ఆయన, వెంటనే అర్బన్, రూరల్ మండలాలుగా విభజించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, నల్లగొండ – ముశంపల్లి – కన్నేకల్ – నల్గొండ – నర్సింగ్‌భట్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి 15 నెలలు గడిచినా పనులు పూర్తి కాలేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపనలకే పరిమితం కాకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, మండల కార్యదర్శి నలుపరాజు సైదులు, మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, జిల్లా అంజయ్య, బొల్లు రవీందర్ పాల్గొన్నారు.