నీలగిరి, జూన్ 26: నల్లగొండ పట్టణ శివారు సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో సంచలం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్యలు వ్యక్తిగత కక్షలు, డబ్బు, బంగారు ఆభరణాల కోసమే మృతురాలి అక్క అల్లుడు ఒక్కడే చేశాడని, అతడికి సహకరించిన భార్య, బంగారం కొనుగోలుకు సహకరించిన స్నేహితుడు, బంగారం వ్యాపారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఒక కారు, రూ.3,004,000 నగదు, హత్యకు ఉపయోగించిన కత్తి (జమ్మి), మూడు సెల్ ఫోన్లు, ఐదు తులాల కరిగించిన బంగారం ముద్ద, ల్యాండ్, బ్యాంక్ పత్రాలు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.
శుక్రవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను ఆయన వివరించారు. ఈ నెల 22న సాయంత్రం నాలుగు గంటలకు ఒకే కుటుంబంలో నాలుగు మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులు సుల్తాన్(45), అతడి భార్య హసీనా(41), ముజమ్మిల్ (20), అఫూరా(12)లుగా గుర్తించి క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా హత్య చేసి పారిపోయారా అనే కోణంలో దర్యాప్తు చేయడానికి డీఎస్పీ కొలను శివరాంరెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, సీసీఎస్ (CCS) సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ బృందాలు చుట్టుపకల వారిని విచారించి, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కీలక సాక్ష్యాలను సేకరించారు. కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేవలం 3 రోజుల్లోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను పట్టుకున్నారు. శుక్రవారం నమ్మదగిన సమాచారం మేరకు నిందితులను నారట్పల్లి ఫె్లైఓవర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పంచుల సమక్షంలో వారిని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుడు ఒక్కడే నలుగురిని హత్య చేసిన తరువాత తన స్నేహితుడు సోహెల్ సహాయంతో బంగారు ఆభరణాలను దిల్‌షుక్‌నగర్‌లోని శ్రీ బాలాజీ జ్యువెలర్స్ యజమాని హేమంత్ కుమార్ వద్ద తాకట్టు పెట్టి రూ.5.3 లక్షలు (రూ. 4 లక్షల నగదు, రూ.1,3 లక్షలు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా) తీసుకున్నాడు.
నిందితుడు సయ్యద్ అస్లాం కారు డ్రైవర్‌గా పని చేస్తూ భార్య తబస్సుంతో కలిసి గండిపేటలో ఉంటున్నారు. కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడి విపరీతంగా అప్పులు చేయడంతో భార్యాభర్తలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ క్రమంలో తబస్సుం తల్లి తహేరా బేగం సొంత చెల్లెలు హసీనా(మృతురాలు) దగ్గర ఏడాది క్రితం అస్లాం రూ.లక్ష అప్పుగా తీసుకొని వడ్డీ చెల్లిస్తున్నాడు. ఇటీవల అస్లాం భార్య గర్భవతి కావడంతో పాటు కొత్త కారు కొనుగోలు చేయడానికి మరో రూ.లక్ష అప్పు ఇవ్వాలని హసీనాను అడిగాడు. హసీనా నిరాకరించి పాత అప్పుకే వడ్డీ సరిగా కట్టడం లేదు.. నీకెందుకు ఇవ్వాలని అవమానకరంగా మాట్లాడటమే కాకుండా, ఇచ్చిన పాత బాకీ వెంటనే తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసింది. దీనిపై అస్లాం, తబస్సుంలు హసీనా కూతురు బుష్రాను సంప్రదించారు.
తన తల్లి హసీనా ఎలాంటి ఆర్థిక సహాయం చేయడం లేదని, మొత్తం సుల్తాన్ పిల్లలు ముజమ్మిల్, అఫూరాలకే పెడుతోందని, ఇంట్లో చాలా డబ్బు, బంగారం ఉందని ఆమె సమాచారం ఇచ్చింది. మరోవైపు 2013లో హసీనా మొదటి భర్త సుజాత్ పెట్టిన కేసులో తబస్సుం తల్లి తహేరా బేగం జైలుకు వెళ్లడానికి హసీనానే కారణమనే పాత కక్ష కూడా ఉంది. తమకు ఆర్థిక ఇబ్బందులున్నా సహాయం చేయడం లేదనే కోపంతో ఎలాగైనా హసీనా ఇంట్లో దొంగతనం చేయాలని తబస్సుం తన భర్త అస్లాంకు సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అస్లాం, అతని స్నేహితుడు సోహైల్ కలిసి మధ్యాహ్నం హసీనా ఇంట్లో ఎవరూ లేనిసమయంలో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అకడ ఎలాంటి డబ్బు, వస్తువులు దొరకకపోవడంతో అస్లాం గోడలకు కోడిగుడ్లు పగులగొట్టి పారిపోయారు.
హసీనా ఇచ్చిన అప్పు కోసం ఇబ్బందులు పెడుతోందని, మరికొంత అప్పు అడిగితే అవమానకరంగా మాట్లాడటంతో పాటు హసీనా కొత్త ఇల్లు కొనేందుకు బ్యాంకులో రూ.2,25 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందని, ఇంట్లో 10 తులాల బంగారం, నగదు ఉన్నట్లు అస్లాం దంపతులు తెలుసుకున్నారు. హసీనా ఎప్పుడూ తన ఒంటిపైనే బంగారం దాచుకుంటుందని, ఆమెను చంపితేనే బంగారం దొరుకుతుందని పథకం వేశారు. ఇందుకోసం హత్య చేసి దొరకకుండా ఉండటం ఎలా? హత్య చేసిన తర్వాత శవాలు ఎన్ని రోజులకు కుళ్లిపోతాయి? పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి? వంటి వీడియోలు అస్లాం యూట్యూబ్‌లో చూసి పకా సెచ్ వేశాడు. అదును కోసం ఎదురు చేసిన అస్లాం ఈ నెల 19న సాయంత్రం ఏడు గంటలకు గండిపేట నుంచి తన మహీంద్రా మరాజో కారులో ఒక జమ్మి కత్తిని తీసుకొని నల్లగొండకు చేరుకున్నాడు. రాత్రి సుల్తాన్‌కు ఫోన్ చేసి, కిరాయి పని మీద నల్లగొండకు వచ్చానని, రాత్రి 11 గంటలకు మీ ఇంటికి వస్తానని చెప్పాడు.
వారు సరిగా స్పందించకపోవడంతో పాటు ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో మరింత కక్ష పెంచుకున్న అస్లాం, సాగర్ రోడ్డు శివారు ప్రాంతంలో వేచి చూసి, అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో కాంపౌండ్ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి దాచుకున్నాడు. తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో హసీనా ఇంటి తలుపు తీసుకొని బయటకు రాగానే గుమ్మం దగ్గర దాకున్న అస్లాం ఒకసారిగా ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు వేస్తూ రక్తపు మడుగులో పడిపోయింది. ఆ కేకలు విని బయటకు వచ్చి తప్పించుకోవడానికి ప్రయత్నించిన సుల్తాన్ మెడపై కత్తితో దాడి చేశాడు. అనంతరం నిద్ర లేచి భయంతో పారిపోతున్న ముజమ్మిల్‌పై దాడి చేయగా, ముజమ్మిల్ తన వద్ద ఉన్న ఐరన్ రాడ్‌తో ప్రతిదాడి చేశాడు. ఈ పెనుగులాటలో అస్లాం ఎడమచేతి చూపుడు వేలికి గాయమైంది.
రెండు కాలి పాదాలకు గాయాలయ్యాయి. అయినా ముజమ్మిల్‌ను అస్లాం నరికి చంపాడు. ఆ సమయంలో బెడ్ రూమ్‌లో ఉన్న సుల్తాన్ చిన్న కుమార్తె అఫూరా భయంతో మంచం కింద దాకుంది. ఆమె తనను చూసిందని, బయటకు చెబితే తాను దొరికిపోతానని భావించిన అస్లాం.. సాక్ష్యం లేకుండా చేయడం కోసం అఫూరాను మంచం కింద నుంచి బయటకు లాగి ఆమె మెడపై కత్తితో బలంగా పొడిచి చంపేశాడు. నలుగురూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత బీరువాలోని 5 తులాల బంగారు ఆభరణాలు, ల్యాండ్, బ్యాంక్ పత్రాలను దొంగిలించాడు.
బయట పడి ఉన్న ముగ్గురి మృతదేహాలను ఎవరూ చూడకుండా ఉండేందుకు వాటిపై చద్దర్లు, చాప లు కప్పి, ఇంటి గేటుకు తాళం వేసి తన కారులో హైదరాబాద్ పారిపోయాడు. సమావేశంలో నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాఘవరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, జితేందర్ రెడ్డి, టూటౌన్ ఎస్ఐ సైదాబాబు, రూరల్ ఎస్ఐ శివప్రసాద్, నకిరేకల్ ఎస్ఐ వీరబాబు సీసీఎస్ బృందం సభ్యులైన విష్ణు వర్ధనగిరి, నాగార్జున ప్రసాద్, పుష్పగిరి, వైదుపాషా, సాయి శివరాజ్, టౌన్ పోలీసు సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించి రివార్డులను ప్రకటించారు.