ఈ వానకాలం సీజన్ నుంచి సన్నాలు సాగు చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో ధాన్యం విక్రయించిన అన్నదాతలకు క్వింటాకు రూ.500బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయిలో సన్నాలు సాగయ్యాయి. సాధారణంగా ప్రతి వానకాలం సీజన్లో సాగైన వరిలో 70శాతం దొడ్డు, 30శాతం సన్న రకం ఉంటుంది. ఈ సారి అందుకు భిన్నంగా సాగైంది. జిల్లా వ్యాప్తంగా 5,10,196 ఎకరాల్లో వరి సాగు కాగా అందులో 2,41,410 ఎకరాల్లో దొడ్డు, 2,68,786 ఎకరాల్లో సన్నరకం ఉన్నది. సాధారణంగా 17శాతం తేమతో ఉన్న దొడ్డు ధాన్యం అయితే క్వింటాకు రూ.2,305, సన్నాలు అయితే మరో రూ.500 కలిపి రూ.2,805 మద్దతు ధర చెల్లించాల్సి ఉంది. ఇది రైతుకు కలిసి వచ్చే అంశమే అయినప్పటికీ ఇది అమలు జరుగుతుందా లేదా అనే మీమాంసలో అన్నదాతలు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత యాసంగిలో మాత్రమే రైతు బంధు వేసింది. ఈ వానకాలం సంబంధించి రైతు బంధు లేదు రైతు భరోసా లేదు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ఇక రుణమాఫీ కూడా అరకొర మాత్రమే కావటంతో ప్రభుత్వం బోనస్ ఇస్తుందా అనే దానిపై రైతులు డైలమాలో ఉన్నారు.
కాంగ్రెస్‌ను రాష్ట్రంలో గెలిపిస్తే ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చి సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని అన్నది. దీనికి తోడు రేషన్ కార్డు దారులకు వచ్చే ఏడాది జనవరి నుంచి సన్న బియ్యం ఇస్తామని చెప్పింది. ఈ సీజన్ నుంచి సన్నాలు పండించిన రైతులకు మద్దతు ధరతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ సారి రికార్డు స్థాయిలో సన్న రకం వరి సాగు పెరిగింది. గతేడాది వానకాలం సీజన్లో 3,6,957 వేల ఎకరాల్లో దొడ్డు రకం, 1,78,488 ఎకరాల్లో సన్న రకం సాగు చేయగా, ఈ ఏడాది మొత్తం 2,68,786 ఎకరాల్లో సన్నాలు, 2,41,410 ఎకరాల్లో దొడ్డు రకం సాగు చేశారు.
అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. కానీ వాటిని గాలికి వదిలేసిన సర్కార్ మాటలు రైతులు నమ్మే పరిస్థితుల్లో లేకుండా పోయారు. రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.7500 ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం గత యాసంగికి సంబంధించింది మాత్రమే ఇచ్చింది. ఈ వానకాలం రైతు భరోసా ఊసేలేదు. ఇక ఆగస్టు15లోపు రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి అరకొరగానే చేసి చేతులు దులుపుకొంది. జిల్లాలో ఇప్పటి వరకు 1.73లక్షల మంది రైతులకు మాత్రమే రూ.1,433 కోట్లు ఇవ్వటంతో ఇంకా 45వేల మంది రైతులు రుణమాఫీ ఇవ్వలేదని దరఖాస్తులు పెట్టుకున్నారు. పలు కారణాలతో వారికి రుణమాఫీ నిలిపేయగా ప్రస్తుతం సర్వే జరుగుతున్నది. రైతు భరోసా, రుణమాఫీ సరిగ్గా ఇవ్వని సర్కార్.. బోనస్ ఇస్తుందా లేదా అనేది రైతులు సందిగ్ధంలో ఉన్నారు.
జిల్లాలో ఈ వానకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఐకేపీ, సహకార శాఖ ఆధ్వర్యంలో పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్ మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో గరిష్టంగా 400 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఆయా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని జేసీ శ్రీనివాస్ ఆయా శాఖల అధికారులను ఇప్పటికే ఆదేశించారు. క్షేత్రస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఈ నెల 25 తర్వాత చేపట్టనున్నారు.
జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి సన్నాలు 2.68 లక్షల ఎకరాల్లో సాగైంది. ప్రధానంగా ఆయకట్టు ప్రాంతంలో ఎడమ కాల్వకు నీటి విడుదల చేయడం వల్ల ఎక్కువ మంది రైతులు సన్నాలు వేశారు. అక్టోబర్1 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. రైతులు తక్కువ ధరకు దళారులు, మిల్లర్లకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఇచ్చే మద్దత ధరను సద్వినియోగం చేసుకోవాలి.
-పాల్వాయి శ్రవణ్ కుమార్, డీఏఓ, నల్లగొండ