సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్ల వేలానికి సంబంధించిన ప్రీ బిడ్ మీటింగ్‌ను గురువారం నుంచి ఈ నెల 7 వరకు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధికారులు బుధవారం తెలిపారు. నిర్ణీత లేఅవుట్లలో ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం వరకు యంత్రాంగం అందుబాటులో ఉండి ఔత్సాహిక కొనుగోలుదారులతో సమావేశాన్ని నిర్వహిస్తుందని చెప్పారు.
ప్లాట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన సమాచారంతోపాటు లేఅవుట్లో కల్పించే మౌలిక వసతులు, ఇతర అంశాలను యంత్రాంగం వివరిస్తుందని తెలిపారు. లేఅవుట్లో విక్రయానికి ఉంచిన ప్లాట్లను మార్కింగ్ చేసి, హెచ్ఎండీఏలో బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీంతో కొనుగోలుదారులు వాటిని సులభంగా పరిశీలించవచ్చచ్చునన్నారు. ఇప్పటికే లేఅవుట్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించే పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.