మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. మంగళవారం సాయంత్రం 6గంటల నుంచి మైకులు మూగబోనున్నాయి. సభలు, సమావేశాలు, ఇతర ఎలాంటి ప్రచార కార్యక్రమాలకు అవకాశం లేదు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి 48గంటల ముందు నుంచి ప్రచారం ముగియనుంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ప్రచారాన్ని నిర్ణీత సమయం నుంచి నిలిపివేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి ఆదేశించారు. పకడ్బందీగా పోలింగ్ నిర్వహణకు అన్ని పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో చివరి రోజు టీఆర్ఎస్ పార్టీ పలుచోట్ల రోడ్‌షోలు నిర్వహించేందుకు సిద్ధమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి పలుచోట్ల రోడ్‌షోలో పాల్గొననున్నారు. ఇక చౌటుప్పల్, చండూరులలో భారీ ర్యాలీలకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్31(నమస్తే తెలంగాణ) : ఎన్నికల ప్రచారంలో చివరి రోజు మంగళవారం టీఆర్ఎస్ భారీ రోడ్‌షోలకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగసభలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొనగా అశేష జనవాహిని తరలివచ్చింది. ఈ సభతో మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు తిరుగులేదన్నది స్పష్టమైంది. ఇక ఇదే ఊపును కొనసాగించాలన్న లక్ష్యంతో మండల కేంద్రాల్లో మంగళవారం రోడ్‌షోలు, భారీ ర్యాలీలకు పార్టీ శ్రేణులు సిద్ధ్దంగా ఉన్నాయి. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సంస్థాన్ నారాయణపురంలో మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడులో మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థ్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు.
ఇక ఇదే సమయంలో మంత్రి హరీశ్‌రావు మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లి మండల కేంద్రంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు మర్రిగూడలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు పాల్గొననున్నారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో మంత్రులు వి.శ్రీనివాసగౌడ్, మల్లారెడ్డి పార్టీ శ్రేణులు నిర్వహించనున్న భారీ ర్యాలీలో ఉదయం 11 గంటలకు పాల్గొననున్నారు. చండూరు మండల కేంద్రంలో ఉదయం 11 గంటలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీకి సిద్ధ్దమయ్యారు. ఇక ఇదే సమయంలో అన్ని గ్రామాల్లోనూ ఎక్కడికక్కడే చివరిరోజు విస్తృత ప్రచారానికి పార్టీ నేతలు సన్నాహాకాలు చేస్తున్నారు.
నేటితో అంతా గప్‌చుప్
మునుగోడు ఉపఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిశాక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థ్ధులు సైతం తమతమ గుర్తులతో ప్రజల్లోకి వెళ్లారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజేపీ అభ్యర్థ్ధులు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నిగ్రామాల్లోనూ ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రతి గ్రామాన్ని టచ్ చేసే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ మునుగోడు అభివృద్ధ్ది ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ కుట్రలపై ప్రజలను చైతన్యం చేశారు. మునుగోడు అభివృద్ధి కోసం టీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగసభలో పాల్గొన్నారు.
చౌటుప్పల్, ఘట్టుప్పల్‌లో మంత్రి కేటీఆర్ రోడ్‌షో నిర్వహించగా, మర్రిగూడలో హరీశ్‌రావులు రోడ్‌షోలో పాల్గొన్నారు. కాగా ఎంపీటీసీ స్థానాల వారీగా ఇన్చార్జి సైతం ప్రతీ గడపను తట్టి టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఈ నెల 3న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో నేటి సాయంత్రం 6గంటల నుంచి ప్రచారానికి తెరపడనుంది. సభలు, సమావేశాలు, ర్యాలీలు అన్ని బంద్ కానుండగా ప్రచార హోరుకు కారణమైన మైకులు కూడా మూగబోనున్నాయి. పోలింగ్ రోజు వరకు అంతా గప్‌చుప్ కానుంది.