సమైక్య పాలనలో ఉపాధి లేక, చేయూత దొరక్క చితికిన చేనేత కుటుంబాలను స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు అన్ని విధాలా ఆదుకుంటున్నది. ప్రతి అడుగులోనూ వెన్నుతట్టి బాసటగా నిలుస్తున్నది. రుణమాఫీ, చేనేత మిత్ర, త్రిఫ్ట్ వంటి పలు పథకాలతో అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేనేత కార్మికుల కోసం బీమా సౌకర్యాన్ని తీసుకొస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో చరిత్రాత్మక పథకానికి శ్రీకారం చుడుతున్నది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7న ప్రారంభించనున్నది. సర్కారు నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 25 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. రైతుబంధు మాదిరిగానే బీమా ప్రీమియాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. 50ఏండ్లలోపు చేనేత కార్మికులు ఏ కారణంతో మరణించినా నామినీకి పది రోజుల్లో బీమా కవరేజ్ అందుతుంది. సీఎం కేసీఆర్ నిర్ణయంపై నేత కార్మిక కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రికి నిండు మనస్సుతో కృతజ్ఞతలు చెప్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి కేకలతో ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలను ఒక్క సర్కారు కూడా ఆదుకోలేదు. ఉన్న ఒకటి రెండు పథకాలను కూడా సరిగ్గా అమలు చేయలేదు. కానీ సాధించుకున్న స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. నేతన్నలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటున్నది. పొదుపు పథకం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థిక తోడ్పాటు కల్పిస్తున్నది. ఇక నూలు, రంగులు, రసాయనాలపై 40శాతం సబ్సిడీ అందిస్తున్నది. నేతన్నకు బీమా పథకం తీసుకొస్తామని గతంలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ దాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనూ దానిపై ప్రస్తావించారు. బీమా పథకానికి బడ్జెట్లో రూ.50 కోట్లను ప్రతిపాదించారు. ఇక దీని అమలు, మార్గదర్శకాల కోసం రెండు నెలల క్రితం జీఓ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు అమల్లోకి వస్తున్నది. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీమా పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 25వేల కుటుంబాలకు ఈ బీమా పథకం వర్తించనున్నది.
ఒక్క రూపాయి ప్రీమియం లేకుండా..
రైతు బీమా తరహాలోనే ప్రభుత్వం నేత కార్మికులకు రూ.5లక్షల బీమా సదుపాయం కల్పించనుంది. రైతు బీమా పథకం కింద గుంట భూమి ఉన్న రైతు మరణించినా బాధిత కుటుంబానికి రూ.5లక్షలు అందిస్తున్నది. ప్రమాదవశాత్తు, ఆత్మహత్యలు సహా ఏ కారణంతో చనిపోయినా డెత్ సర్టిఫికెట్ ఆధారంగా బీమా ఇస్తున్నది. ఈ పథకానికి రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తున్నది. అదే తరహాలో నేత కార్మికులకు సైతం బీమా పథకాన్ని తీసుకొస్తున్నది. ఈ స్కీం ప్రకారం ఎవరైనా, ఏ కారణంతోనైనా చనిపోతే వారి కుటుంబాలకు పరిహారం అందుతుంది. చనిపోయిన పది రోజుల్లో మొత్తం అమౌంట్ అకౌంట్లో జమ అవుతుంది. 60 ఏండ్లలోపు ఉన్న చేనేత, మరమగ్గాల కార్మికులు దీనికి అర్హులుగా తేల్చారు. పథకం అమలుకు జౌళి శాఖ నోడల్ ఏజెన్సీ ఉంటుంది. నేతన్న బీమా కోసం ఎల్ఐసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వార్షిక ప్రీమియం కోసం కార్మికుడు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో చేనేత బీమాపై హర్షం వ్యక్తమవుతున్నది. చేనేత కార్మికులతోపాటు నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం
తాతల కాలం నుంచి చేనేత వృత్తి చేసుకునే బతుకుతున్నం. వేరే పని తెల్వదు. ఎన్నో ఇబ్బందులు తట్టుకొని వృత్తిని కొనసాగిస్తున్నం. అలాంటి మాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించడం సంతోషకరం. చేనేత రంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నూలు, రంగులను సబ్సిడీపై ఇస్తున్నది. మార్కెట్‌పై దృష్టి పెట్టడంతో కార్మికులకు ఉపాధి మెరుగుపడింది. లేకపోతే వృత్తిని వదులుకోవాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– దుద్యాల శంకర్, చేనేత కార్మికుడు, కొయ్యలగూడెం,
చేనేత కార్మికులకు భరోసా
చేనేత కార్మికులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో తీసుకొచ్చిన బీమా పథకం నేత కార్మికులకు భరోసా ఇస్తుంది. బడ్జెట్లో చేనేత రంగానికి 1200 కోట్ల రూపాయలు కేటాయించి వృత్తిదారులకు మరమగ్గాలు, నూలు దారాలకు నిధులు ఇస్తున్నది. రైతు బీమా తరహాలోనే 60 ఏండ్లలోపు ఉన్న కార్మికులకు ఇప్పుడు రూ.5 లక్షల బీమా ఇవ్వడం మంచి విషయం. ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే ఆ కుటుంబం వీధిన పడకుండా ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
– తిరందాసు విష్ణు, చేనేత సంఘం నాయకుడు, మిర్యాలగూడ
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు బీమా పథకం ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. చేనేత కార్మికులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. చేనేత కార్మికుడి మృతి చెందిదే ఆ కుటుంబానికి ఈ బీమా ఎంతో భరోసానిస్తుంది. ప్రభుత్వమే ఉచితంగా ప్రీమియం చెల్లించడం గొప్ప విషయం.
– ఇడెం కైలాసం, చేనేత కార్మిక సంఘం నాయకుడు, గట్టుప్పల్
చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. సంక్షేమ పథకాల అమలుతోపాటు కార్మికులకు అండగా ఉంటూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. రైతులకు రైతుబీమా మాదిరిగా చేనేత కార్మికులకు చేనేత బీమా పథకాన్ని తీసుకురావడం హర్షణీయం. ఈ నెల 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత బీమాను అమల్లోకి తీసుకొస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– సామల వెంకటేశ్, వస్త్ర వ్యాపారి, భువనగిరి
చతికిలా పడ్డ చేనేతకు ఊపిరి
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. చతికిలా పడిన చేనేత రంగాన్ని ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. కొత్తగా చేనేత బీమా పథకం ప్రవేశపెట్టడం సంతోషకరం. ఈ పథకంతో నేతన్నలకు ఎంతో భరోసా ఉంటుంది. రైతు బీమాలాగా నేతన్న బీమా ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– కాముని రవి, సిల్క్‌నగర్, ఆలేరు
గొప్ప నిర్ణయం
చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. దీని వల్ల మా కుటుంబాలకు భరోసా ఉంటుంది. ఇప్పటి వరకు చేనేతల బాగోగులు పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. మా కష్టాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బీమా ఇవ్వడం సంతోషకరం.
– గాంధాల బాలరాజు, చేనేత కార్మికుడు, గౌరాయపల్లి, యాదగిరిగుట్ట మండలం
సీఎం కేసీఆర్ చేనేత బంధువు
రాష్ట్ర ప్రభుత్వం నేతన్న బీమా పథకం ప్రవేశ పెడుతామని నిర్ణయించడం హర్షణీయం. సీఎం కేసీఆర్ చేనేత బంధువుగా చరిత్రలో నిలిచిపోతారు. ఈ పథకం ద్వారా నేతన్న బతుకుల్లో భరోసా కలుగుతుంది. చేనేత దినోత్సవం రోజు ఈ పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు నేతన్నలంతా రుణపడి ఉంటారు.
– కటకం స్వామి, చేనేత కార్మిక సంఘం నాయకుడు, రాజాపేట
నేతన్నలకు బీమా హర్షణీయం
చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా తరహాలో నేతన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయం. 60 సంవత్సరాల్లోపు చేనేత కార్మికులందరికీ ఈ బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం రోజు నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించబోతుండడం సంతోషకరం.
– రచ్చ గోవర్ధన్, పద్మశాలీ సంఘం జిల్లా నాయకుడు, ఆత్మకూరు(ఎం)
బీమా గొప్పవరం
రాష్ట్ర ప్రభుత్వం రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకు నేతన్న బీమా పథకాన్ని తీసుకురావడం చాలా సంతోషదాయకం. ఈ పథకం వల్ల నిరుపేద చేనేత కార్మిక కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. చేనేత వృత్తిపై ఆధారపడిన వారందరికీ వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేయాలి.
– పున్న వెంకటేశం, చేనేత కార్మిక సంఘం నాయకుడు, సిరిపురం
గతంలో అభివృద్ధికి నోచని నేత కార్మికులు
గత ప్రభుత్వాల హయాంలో చేనేత కార్మికులకు ఆత్మహత్యలే తప్ప అభివృద్ధికి నోచుకోలేదు. సీఎం కేసీఆర్ నేత కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారు. రైతు బీమా తరహాలో చేనేత కార్మికులకు చేనేత బీమా పథకం ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేనేత కార్మికులందరం జీవితాంతం రుణపడి ఉంటాం.
– విడం సాయికిశోర్, సంస్థాన్ నారాయణపురం