బీబీనగర్, ఆగస్టు 2 : బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ప్రాక్టికల్, లెర్నింగ్లో అనుభవాన్ని పెంపొందించడానికి గూడూరు చిన్న నర్సిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గూడూరు మహేందర్రెడ్డి రూ.48 లక్షలతో డిజిటల్ లైబ్రరీని నిర్మించారు. అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తెచ్చారు. డిజిటల్ లైబ్రరీ ఫొటోలను స్థానికులు ట్విట్టర్లో పెట్టడంతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చూసి అభినందించారు. విద్యార్థులు చదువులో రాణించేందుకు చేయూతనివ్వాలన్న గూడూరు మహేందర్రెడ్డి ఆలోచన చాలా గొప్పదని ప్రశంసించారు. ఈ డిజిటల్ లైబ్రరీని బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలో శ్రీ సాయి బృందావనం దేవస్థానం నూతన ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకానున్నారు. అనంతరం బీబీనగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రాగి జావ పంపిణీలో పాల్గొంటారు.