యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి క్షేత్రంలో శుక్రవారం శ్రావణ లక్ష్మి కోటికుంకుమార్చన కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ప్రధానాలయం వెలుపలి ప్రాకారం ఈశాన్య మండపంలో పశ్చిమదిశకు అభిముఖంగా లక్ష్మి అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి పట్టువస్ర్తాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఉదయం 9 గంటలకు విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, పుణ్యాహవాచనం, రక్షాబంధనంతో కుంకుమార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు కుంకుమార్చన పూజ కొనసాగాయి. 2 వేల రూపాయల టికెట్ స్వీకరించిన భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం చేశారు. పూజల్లో పాల్గొన్న భక్తులు స్వామివారి శెల్లా, కనుము, మహాప్రసాదం, అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని అందజేశారు. మొదటిరోజు వేడుకల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, ఈఓ ఎన్. గీత, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ పాల్గొన్నారు. కార్యక్రమంలో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, అర్చకులు కిరణాచార్యులు, ప్రశాంత్ ఆచార్యులు పాల్గొన్నారు.
– యాదాద్రి, జూలై29
లక్ష్మి సహస్రనామ పఠనం
శ్రావణలక్ష్మి కోటికుంకుమార్చన మొదటి రోజు రుత్వికులు 3.60 లక్షల లక్ష్మి సహస్రనామాన్ని పఠించారు. 30 మంది రుత్వికులు ఒక్కొక్కరు 12 సార్లు లక్ష్మి సహస్రనామాన్ని పఠించారు. వీరితోపాటు ఆస్థాన అర్చకులు, పాచకులు, పరిచారకులు పాల్గొన్నారు. ఉదయం నాలుగు గంటలు, సాయంత్రం నాలుగు గంటలు లక్ష్మి సహస్రనామ స్మరణ సాగింది.
ఆకట్టుకున్న నృత్యాలు
కోటికుంకుమార్చన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. రాంపల్లికి చెందిన సాంస్కృతిక విశ్వకళా మండలి ఆధ్వర్యంలో కూచిపూడి, పేర్ని నృత్యాలు చేశారు. బాలికల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.