రామగిరి, జూలై 22 : విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక అంశాలు అలవర్చుకోవాలని ఎంజీయూ వీసీ, ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్‌రెడ్డి సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పేరుగాంచిన నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ) 66వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంజీయూ వీసీ గోపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కళాశాల పూర్వ విద్యార్థి, తెలంగాణ యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్ దాచేపల్లి రవీందర్గుప్తాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంజీయూ వీసీ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో ఖ్యాతిగాంచిన ఈ కళాశాలలోవిద్యార్థులు సీటు సాధించి చదవడం చాలా అదృష్టంగా భావించాలన్నారు. ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించి ఆయా రంగాల్లో స్థిరపడి దేశ, రాష్ర్టాభివృద్ధి పాటుపడాలని సూచించారు. నేటి ఆధునిక యుగంలో మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకుని పరిశోధనల వైపు అడుగు వేయాలన్నారు. స్వయం ఉపాధి పొందడమే గాక తోటివారికి ఉపాధి కల్పించేలా నూతన అన్వేషణలతో పురోగమించాలన్నారు.
కళాశాల పూర్వ విద్యార్థి, తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌గుప్త మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత వ్యక్తిత్వ విలువలు పెంచుకోవాలన్నారు. జీవిత లక్ష్యంతో పాటు తల్లిదండ్రుల కల సాకారానికి విద్యార్థి దశ కీలకమైందని పేర్కొన్నారు. విద్యార్థులందరూ శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని, నేటి తరానికి యువ శాస్త్రవేత్తల అవసరం ఎంతో ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఘన్‌శ్యాం మాట్లాడుతూ కళాశాలలో చదివిన విద్యార్థులు వివిధ రంగాల్లో రాణిస్తూ కళాశాలకు మంచి పేరు తెస్తున్నారని కొనియాడారు. అనంతరం 2016-17 నుంచి 2020-21 విద్యా సంవత్సరం వరకు డిగ్రీ వివిధ కోర్సుల్లో సత్తాచాటి టాపర్స్‌గా నిలిచిన 40మందికి, పీజీ కోర్సులో టాపర్స్‌గా నిలిచిన ఐదుగురికి మొత్తంగా 45మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలు అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల స్టూడెంట్ వెల్ఫేర్ ట్రస్టు కోశాధికారి జి.లింగయ్య, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష,కార్యదర్శులు సుంకరి రాజారాం, బోనగిరి దేవేందర్, కోశాధికారి ఎ.అంజిరెడ్డి, ఎంవీ.గోనారెడ్డి, ఎన్జీ కళాశాల బంగారు పతకాల కమిటీ కన్వీనర్, పరీక్షల నియంత్రణాధికారి బి.నాగరాజు, కో కన్వీనర్ తండు కృష్ణకౌండిన్య, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ మునీరోద్దీన్, గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు ఎ.దుర్గాప్రసాద్, సూపరింటెండెంట్ కోటేశ్వర్రావు, పీడీ కడారి మల్లేశ్, ఎన్జీ కళాశాల వివిధ విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.