సూర్యాపేట టౌన్, జూలై 16 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న రోడ్ల విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్లను విస్తరిస్తున్నందున వాహనదారులు తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ప్రయాణాలు కొనసాగించాలని సూచించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాలను శనివారం మంత్రి జగదీశ్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల సుందరీకరణలో భాగంగా కొనసాగుతున్న అభివృధ్ధి పనుల్లో అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
అభివృద్ధితోపాటు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం ప్రసాదించిన సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. రోడ్ల విస్తరణతోపాటు అన్ని సౌకర్యాలతో సూర్యాపేటను మరింత సుందరంగా తీర్చిదిద్దుకుందామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో నిధులకు వెనుకాడబోమని, నాణ్యతలో రాజీపడేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సూర్యాపేటలో బతుకమ్మ సంబురాల కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలో వాహనదారులు ఇష్టానుసారంగా వెళ్లకుండా ఎల్ సేపులో ఉన్న రోడ్డును మాత్రమే ఉపయోగించుకునేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ వెస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ నెమ్మాది భిక్షం, గుడిపూడి వెంకటేశ్వరరావు, బైరు వెంకన్నగౌడ్, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, కీసర వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరికలు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాజకీయాలకతీతంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలవారు టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తూ సంచలనాత్మకంగా కొనసాగుతున్న పాలనతో ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలంతా గులాబీ గూటికి చేరుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకుడు గుర్రం సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో శనివారం చివ్వెంల మండలం గాయంవారిగూడెం, రోళ్లబండతండాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ వార్డు మెంబర్లు, నాయకులు టీఆర్ఎస్లో చేరగా మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సూర్యాపేటను జిల్లాగా సాధించుకోవడంతోపాటు మెడికల్ కళాశాల ఏర్పాటు, ఎక్కడా లేని విధంగా రెండు మినీ ట్యాంక్బండ్లు, ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ మార్కెట్‌ను సాధించుకున్నామన్నారు. ప్రసుత్తం వాటి పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. అలాగే ఎన్నో ఏండ్లుగా ఉన్న రోడ్ల సమస్యలు మరికొద్ది రోజుల్లో తీరనున్నాయని, ఇప్పటికే విస్తరణ పనులు పూర్తయ్యాయని, నిర్మాణ పనులు సైతం మరింత వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అంతకు మించి అభివృద్ధి చేస్తున్న పార్టీగా టీఆర్ఎస్ చరిత్ర సృష్టిస్తుందన్నారు. అందుకే అభివృద్ధికి ఆకర్షితులై అంతా టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని పేర్కొన్నారు. రోళ్లబండతండా, గాయంవారిగూడెం 1, 4వ వార్డు మెంబర్లు ధరావత్ మల్సూర్, పారెల్లి పాపారావు, నాయకులు ధరావత్ సీతారాములు, మాలోతు చాంప్లా, బానోతు నర్సింహ టీఆర్ఎస్లో చేరగా, కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కలకోట్ల సైదులు, బుజ్జీకాశీం, నాగమ్మాకాశీం, కలకోట్ల పరశురాములు, లింగయ్య, మోహన్, పీక్యానాయక్, వేణు, లింగయ్య పాల్గొన్నారు.