పేద, మధ్య తరగతికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించి చదివించాలని ఆశపడతారు. కానీ ఆర్థిక పరిస్థితులు సరిపడక వారి ఆశ నిరాశ అవుతుంది. పేద కుటుంబాల కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యాపథకాన్ని తీసుకొచ్చింది. పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులు ఈ పథకం ద్వారా ఉచితంగా కార్పొరేట్ కళాశాలల్లో చదివేందుకు అవకాశం కలుగుతుంది. పదో తరగతిలో 7 జీపీఏ ఆపైన సాధించిన విద్యార్థులు కార్పొరేట్ విద్యా పథకానికి అర్హులు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలతోపాటు దివ్యాంగ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాల విద్యా పథకంలో అవకాశం కల్పిస్తున్నారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు రెండేండ్లపాటు 35వేల రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజు, ప్యాకెట్ మనీ కింద 3 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.
కావాల్సిన సర్టిఫికెట్లు
పదో తరగతి మెమో, కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు మీసేవ ద్వారా పొందినవి. బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, మూడేండ్ల బోనోఫైడ్ సర్టిఫికెట్లు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో http://telanganaeapass.cgg.gov.in వెబ్సైట్లో ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రాధాన్యత క్రమంలో 3 కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ-పాస్ సిస్టమ్ ద్వారా విద్యార్థుల ఎంపిక ఆటోమెటిక్‌గా జరుగడంతోపాటు కళాశాలలు కేటాయించడం జరుగుతుంది.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఫీజులు చెల్లించకుండా కార్పొరేట్ కళాశాలల్లో విద్యను అభ్యసించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నది. ఈ పథకంతో పేద విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ఇంటర్మీడియట్ విద్యను కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో పూర్తి చేసుకోవచ్చు.
-ఎం.జైపాల్‌రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి