నల్లగొండ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (నరేగా) పనులు నత్తనడకన సాగుతున్నాయి.తెలంగాణకు హరిత హారంలో భాగంగా గుంతలు తీసి మొక్కలు నాటడం, కాల్వల పనులు, అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్ వంటి లక్ష్యాల్లో సిబ్బంది నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పని చేయకపోవడం వల్ల ప్రగతిలో జిల్లా 29వ స్థానానికి పడిపోయింది. ప్రధానంగా కొందరు మండల అధికారులు విధి నిర్వహణ నిర్లక్ష్యంగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు ఆ శాఖలో చర్చ నడుస్తున్నది. ప్రగతిలో వెనుకబడడంపై రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ సైతం ఇటీవల జిల్లా యంత్రాంగంపై సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ క్రమంలో లక్ష్యంలో వెనుకబడ్డ ఆరుగురు మండల అధికారులకు రూ.5వేలు జరిమాన విధిస్తూ డీఆర్డీఏ పీడీ మెమోలు జారీ చేయగా, 15 రోజులైనా వివరణ ఇవ్వని ఏపీఓలు డీఆర్డీఓ తమను ఇబ్బంది పెడుతున్నదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం.
నల్లగొండ, జూలై 15 : జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రత్యేక పనులతో పాటు సీజనల్ పనులు కూడా ప్రతి ఏటా నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా పడడంతో తెలంగాణకు హరితహారం కింద గుంతలు తీసి మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాది డీఆర్డీఏ 18 లక్షల గుంతలు తీసి మొక్కలు నాటాల్సి ఉండగా ఇప్పటి వరకు 4.50 లక్షల మొక్కలు మాత్రమే నాటారు. కూలీలు అందుబాటులో ఉన్నప్పటికీ వారికి పని కల్పించి గుంతలు తీయించి మొక్కలు నాడడంలో కిందిస్థాయి యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. రహదారి వెంట మొక్కలు నాడడం, రైతులు పొలాల్లో నాటుకునేందుకు మొక్కల పంపిణీ, అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ చేయాల్సి ఉండగా ఆయా పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆశించినంత ప్రగతి సాధించలేక పోయారు.
మేట్ల అవగాహన లేమితో నిర్దిష్ట కూలి పొందని కూలీలు..
జాతీయ ఉపాధిహామీ పథకం కింద ప్రభుత్వం ప్రతి రోజు రూ.257 కూలి అందజేస్తున్నది. అయితే ఈ కూలీ పొందాలంటే నిర్దిష్ట కొలతల మేరకు సదరు గుంతలు తీయాల్సి ఉంది. ఈ కొలతలు పెట్టటంలో మేట్లకు పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో 80 శాతం మంది కూలీలకు నిర్దేశించిన వేతనం రూ.257 దక్కలేదనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మేట్లకు శిక్షణ ఇవ్వమని ఆదేశించింది. ఈ సర్క్యులర్‌ను రెండు నెలలైనా పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. ఇక కూలీలు పనులు చేసినప్పటికీ వారి బ్యాంకు ఖాతా లు అప్డేట్ చేయని కారణంగా 13 వేల మస్టర్లు పెండింగ్‌లో ఉండి వారి వేతనం ఇప్పటికీ అందలేదు. దీనిపై ఇటీవల జడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ చర్చ జరిగింది. ఇక ఈ ఏడాది లేబర్ బడ్జెట్ ఆగస్టు 2022 నాటికి 74.26 లక్షల పని దినాలు చేయాల్సి ఉండగా 43.93 లక్షల పనిదినాలు మాత్రమే చేయడంతో 60 శాతం లక్ష్యం కూడా చేరుకోలేకపోయారు. ప్రస్తుతం ఏ పనులు లేకపోయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా సగటున ప్రతి రోజు 10 వేలకు మించి కూలీలు రావటం లేదంటే పను లు ఏస్థాయిలో నడుస్తున్నాయో స్పష్టమవుతుంది.
శాఖా పరమైన వివాదాలతో నీరుగారుతున్న లక్ష్యం
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో శాఖాపరమైన వివాదాల నేపథ్యంలోనే ప్రభుత్వ లక్ష్యం, పథకాల ప్రగతికి ఆటంకం ఏర్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నార్కట్‌పల్లి మండలంలోని అక్కెనపల్లిలో స్త్రీ నిధి డబ్బుల విషయంలో దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలతో మొదటిసారి డీఆర్డీఏ ఏపీడీ క్లీన్ చీట్ ఇవ్వగా మరోసారి ఫిర్యాదు మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా రెండోసారి విచారణ చేసి ఒక ఏపీఎంతో పాటు సీసీని విధుల నుంచి తొలగించారు. అంతకుముందు ఇదే కార్యాలయంలో పని చేస్తున్న డీపీఎం మరో కారణంతో తొలగించబడ్డాడు. ఈ తరుణంలోనే ఆరుగురు ఏపీఓలకు మెమోలు ఇవ్వడం మూలంగా రాచుకున్న నిప్పు అది కాస్త పెరిగి వివాదంగా మారి ప్రభుత్వ లక్ష్యానికి అడ్డంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందినిని వివరణ కోరగా డీపీఎం, ఏపీఎం, సీసీల తొలగింపు ఆర్డీ కమిషనర్ చేశారని.. ప్రగతిలో వెనకబడడంతోనే తాను మెమోలు ఇచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ పనుల ప్రగతి పెరిగిందని త్వరలో మెరుగైన స్థానం సంపాదిస్తామని పేర్కొన్నారు.