మిర్యాలగూడ, జూలై 15 : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిగజారుడు మాటలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి సూచించారు. శుక్రవారం పట్ణణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుపై కోమటిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో సీఎం కేసీఆర్ పరిపాలన బాగుందని పొగిడి, టీఆర్ఎస్లో చేరేందుకు రాయబారాలు చేసిన కోమటిరెడ్డి నేడు అవాకులు చవాకులు పేలడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు డిపాజిట్ దక్కితే ఆయన కార్యాలయంలో అటెండరుగా పని చేస్తానని కోమటిరెడ్డి సవాల్ విసిరిన విషయాన్ని గుర్తు చేశారు.
30 వేల మెజార్టీతో భాస్కర్‌రావు ఘన విజయం సాధించారని, ఇచ్చిన మాట ప్రకారం అటెండరుగా పని చేయకుండా అసత్యారోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి మంచి నాయకుడిగా ఎమ్మెల్యే భాస్కర్‌రావు గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు చేస్తున్నారని నిరాధారణ ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని, నిరూపించకపోతే కోమటిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, యాదగిరిరెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అన్నభీమోజు నాగార్జునాచారి, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, కుర్ర విష్ణు, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, పూనాటి లక్ష్మీనారాయణ, మాజీద్, శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.