హాలియా, జూలై 15 : పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ తెలిపారు. నియోజకవర్గంలోని త్రిపురారం, తిరుమలగిరి సాగర్, పెద్దవూర మండలాల్లో పోడు భూముల సమస్యపై రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖ అధికారులతో శుక్రవారం అనుముల మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులు అటవీశాఖ భూములను సేద్యం చేసుకోవద్దని కోరారు. అదే విధంగా పట్టాలు కలిగి డీఫారెస్ట్ భూములను సేద్యం చేసుకుంటున్న గిరిజన రైతులను ఇబ్బంది పెట్టొద్దని అటవీశాఖ అధికారులకు సూచించారు.
డీఫారెస్ట్ భూములను సేద్యం చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇచ్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అటవీ భూములను కాపాడడంలో అధికారులు, గిరిజనులు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. సమావేశంలో మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్‌సింగ్, హాలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మా శంకరయ్య, పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, హాలియా మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, పెద్దవూర సహకార సంఘం చైర్మన్ గుంటుక వెంకట్‌రెడ్డి, హాలియా మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, కొత్తపల్లి సహకార సంఘ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్‌రెడ్డి, తాసీల్దార్లు లావూరి మంగ, కేసీ ప్రమీలా, పాండు నాయక్, సైదులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు కురాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, రవినాయక్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
అనుముల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త అలుగుల కృష్ణారెడ్డి తండ్రి రాంచంద్రారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఎమ్మెల్యే నోముల భగత్ కొత్తపల్లి గ్రామానికి చేరుకొని రాంచంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ఎంపీటీసీ వెంకటయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి ఎన్నమల్ల సత్యం, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాసరెడ్డి నాయకులు ఉన్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలని నియోజకవర్గానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్లు ఎమ్మెల్యే నోముల భగత్‌ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏజెంట్లు శ్రీనివాస్, కృష్ణ, వెంకట్‌రెడ్డి ఉన్నారు.
హాలియా : మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హాలియాలో జరిగిన మినీ అంగన్వాడీ కేంద్రాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తల మాదిరిగానే మినీ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. అనంతరం మినీ అంగన్వాడీ టీచర్లు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో మినీ అంగన్వాడీ టీచర్స్ ఆసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడేపు వరలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఇందిర, రమణ, సుజాత పాల్గొన్నారు.