నైరుతి కురిసింది. నేల తడిసింది.సంతోషంగా ఏరువాక సాగింది. వానకాలం సీజన్‌కు సిద్ధంగా ఉన్న రైతులు సోమవారం రాత్రి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు వాన పడడం, మంగళవారం ఏరువాక పౌర్ణమి కలిసి రావడంతో నాగళ్లు గట్టి పొలాలు దున్నారు. కొన్నిచోట్ల విత్తనాలు కూడా వేశారు. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో ఉత్సాహంగా ముందుకు సాగారు. కాళేశ్వరం, మూసీతోపాటు చెరువుల్లో పుష్కలంగా నీళ్లుండడంతో ధీమాగా పొలం పనులు మొదలు పెట్టారు. పలు కాడెడ్లను అందంగా ముస్తాబు చేసి గులాల్ జల్లి ఏరువాక యాతర చేపట్టారు. మరోవైపు మృగశిర మొదలైనా భగ్గుమంటున్న ఎండలతో అల్లాడిన జనం కొంత చల్లబడిన వాతావరణంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
సూర్యాపేట, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : మృగశిర కార్తె ప్రారంభమైన కొద్దిరోజులుగా ఎండలు భగ్గుమనగా ఏరువాక పౌర్ణమికి ముందే వరుణుడు కరుణించాడు. సోమవారం రాత్రి నుంచి జిల్లాలో చినుకులు పడుతున్నాయి. దాంతో పంటల సాగుకు రైతన్న సిద్ధమయ్యాడు. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు రైతులు సంతోషంగా జరుపుకొన్నారు. ఎడ్లు, ట్రాక్టర్లు, నాగళ్లకు పూజలు చేసి దుక్కులు దున్నారు. పలుచోట్ల విత్తనాలు వేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మెట్ట పంటలకు అనుకూలంగా ఉండడంతో పత్తి, కంది, పెసర, వేరుశనగ తదితర పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
సాగునీటికి ఢోకాలేదు..
వర్షాకాలం ప్రారంభమై వారం రోజులు గడిచినా భానుడు నిప్పులు కురిపించగా వరుణుడి జాడ కనిపించలేదు. అయినప్పటికీ రైతుల్లో సాగునీటి టెన్షన్ పెద్దగా కనిపించలేదు. కాళేశ్వరం ద్వారా గోదావరి, నాగార్జున సాగర్ ద్వారా కృష్ణా, మూసీ జలాలు సమృద్ధిగా ఉండడం.. ఇక చెరువులు, కుంటలు సైతం నిండుగా ఉండడంతో సాగుకు నీటికి ఇబ్బందులు లేవు. భూగర్భ జలాలు సైతం పుష్కలంగా ఉండడంతో బోరుబావుల ద్వారా సాగు చేస్తున్నారు. గతంలో జిల్లాలో ఒక శాతానికి మించి పచ్చదనం లేకపోగా హరితహారంతో 12శాతానికి చేరింది. వర్షాలు కూడా అనుకూలంగా పడుతుండడంతో రైతులకు సాగు కష్టాలు తప్పాయి.