యాదాద్రి, జూన్14 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఉన్న క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ మంగళవారం ఆకుపూజ నిర్వహించారు. యాదాద్రి క్షేత్రానికి పాలకుడిగా క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆలయంలోని హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చించారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. లలితాపారాయణం చేపట్టి, ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు.
తిరు కల్యాణోత్సవం
పంచ నారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో స్వయంభువు నారసింహుడికి నిత్యారాధనలు ఉదయం 3.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాతసేవ మొదలుకొని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు జరిపారు. ప్రధానాలయ ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మొదటగా సుదర్శన నారసింహహోమం నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాతం, తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపారు. స్వయంభు ప్రధానాలయంలో కొలువైన ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
సాయంత్రం ప్రాకారంలో వెండి మొక్కు జోడు సేవోత్సవం, దర్బార్ సేవలు నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి తిరువారాధనలు, తులసీ నామార్చనలు, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయుడికి సహస్రనామార్చన చేపట్టారు. కొండకింద పాత గోశాల వద్ద సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని, వ్రత మాచరించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు అత్యంత వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. స్వామివారి ఖజానాకు రూ.19,06,712 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
హుండీల లెక్కింపు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి 7 రోజుల హుండీల ఆదాయం 69,57,943 నగదుతో పాటు బంగారం, వెండి వచ్చినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు. మంగళవారం యాదాద్రి కొండపై గల హరిత హోటల్లో హుండీలను లెక్కించారు. హుండీల్లో నగదుతో పాటు మిశ్రమ బంగారం 52 గ్రాములు, మిశ్రమ వెండి రెండు కిలోల 200 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. దాంతో పాటు 216 అమెరికా డాలర్లు, 280 ఆస్ట్రేలియా డాలర్లు, 10 ఇంగ్లాండ్కు చెందిన పౌండ్స్ స్వామి వారికి సమకూరినట్లు పేర్కొన్నారు.