వనస్థలిపురం, జూన్ 14 : మంగళంవారం ఉదయం 10.30గంటలు. వనస్థలిపురం సుష్మా చౌరస్తా వద్ద అందరూ ఎవరి పనుల్లో వారు ఉన్నారు. జాతీయ రహదారిపై వాహనాలు వస్తూ వెళ్తూ ఉన్నాయి. హఠాత్తుగా ఓ కంటైనర్ రోడ్డుకు ఎడమ పక్కగా దూసుకొచ్చింది. అక్కడున్నవారంతా భయభ్రాంతులతో పరుగులు తీశారు. లారీ ముందు నుంచి వెళ్తున్న బైక్ పైనుంచి దూసుకెళ్లడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ మృతి చెందారు. మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. నిమిషాల్లో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మూడు బైకులు పనిరాకుండా ధ్వంసమైపోయాయి. అరుపులు, కేకలు ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నల్లగొండలోని లక్ష్మీనగర్‌లో నివాసముండే ముమ్మడి విజయలక్ష్మి(43) హయత్‌నగర్ రాఘవేంద్ర కాలనీలో ఉంటున్న తన అన్న బోగోజు సురేశ్‌కుమార్ ఇంటికి వచ్చింది. తన ఇంటి రుణం విషయమై అమీర్‌పేట్‌లోని ఎల్ఐసీ ఆఫీస్‌కు వెళ్లాలని అన్నతో చెప్పింది. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో అన్నాచెల్లెళ్లు బైక్(టీఎస్ 07 జీడబ్ల్యూ 7242)పై బయలుదేరారు. ఆటోనగర్ దాటి సుష్మా చౌరస్తా వద్దకు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి దూసుకొచ్చిన పాల కంటైనర్ వారిని ఢీకొట్టి పైనుంచి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న సురేశ్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న విజయలక్ష్మి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మరో వాహనదారుడు మురళీమోహన్ స్వల్పగాయాలతో బయటపడి చికిత్స పొందుతున్నాడు. నల్లగొండకే చెందిన సురేశ్‌కుమార్ కొన్నేండ్ల కింద హైదరాబాద్కువచ్చి స్థిరపడ్డాడు.
తప్పిన పెను ప్రమాదం
ప్రమాదానికి కారణమైన కంటైనర్ హయత్‌నగర్ వైపు నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్తుంది. సుష్మా చౌరస్తా వద్దకు రాగానే లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ముందు పదుల సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఆందోళనకు గురైన డ్రైవర్ లారీని ఎడమ వైపునకు మళ్లించాడు. మృతుల పైనుంచి దూసుకెళ్లిన లారీ అక్కడ ఉన్న పాన్ డబ్బా, మూడు వాహనాలను ధ్వంసం చేసి భవనానికి ఢీకొట్టింది. రోడ్డు పైనుంచి దూసుకెళ్తే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీస్‌స్టేషన్ వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.