నీలగిరి, జూన్ 14 : జిల్లాలో బాలల సంరక్షణ కోసం నిర్వహిస్తున్న కేంద్రాలు ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేయాలని, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి సి.సుభద్ర హెచ్చరించారు. మంగళవారం బాలల సంరక్షణ కేంద్రాల ప్రతినిధులతో బాలరక్షా భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. ప్రతీ కేంద్రం ఐదేండ్ల గడువుతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు.
6 నుంచి 18 ఏండ్లలోపు బాలలకు ఆశ్రయం కల్పిస్తున్న కేంద్రాలు తప్పనిసరిగా బాలల చట్టాలు, ప్రాథమిక సూత్రాలలో నిర్ధేశించిన విధంగా కనీస ప్రమాణాలు పాటించాలని చెప్పారు. చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తున్న ప్రభుత్వేతర సంస్థలు ఆనాథ పిల్లల వివరాలు వెంటనే సమర్పించాలని పేర్కొన్నారు. వారిని బాలల సంక్షేమ సమితి ముందు హాజరుపరిచిన తర్వాతే దత్తత ప్రక్రియలోకి తీసుకురావాలన్నారు. వారికి నాణ్యమైన విద్య, ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో బాలల పరిరక్షణ సమితి చైర్మన్ చింతా కృష్ణ, సభ్యులు భాస్కర్, లక్ష్మీకిరణ్, వెంకటరమణ, బాలల పరిరక్షణ అధికారి కాసాని గణేశ్, బాలల సంక్షేమ సమితి కో ఆర్డినేటర్ హరిత, సిబ్బంది విద్య, తేజస్వీని, రేవతి, రమణీ, రాము, అంజలి పాల్గొన్నారు.