జూన్ 14 : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని మంగళవారం దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హైదరాబాద్‌లో వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే చిరుమర్తి నకిరేకల్ నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ లేదా ఐటీఐ కళాశాల, చిన్నకాపర్తి, గుడివాడ గ్రామాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల మంజూరుతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.
దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రులు నిధుల మంజూరుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే విలేకరులకు తెలిపారు. అలాగే దేవరకొండ మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మంత్రి కేటీఆర్‌ను కోరారు. మున్సిపాలిటీలో అంతర్గత సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీలకు సంబంధించి రెండు ఎస్టీపీలను మంజూరు చేయాలని విన్నవించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.