యాదాద్రి, జూన్ 7 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయంలో మంగళవారం ఆర్జిత పూజల కోలాహలం నెలకొంది. స్వయంభూ నారసింహుడికి ఉదయం 3.30గంటల నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు చేశారు. ప్రధానాలయ ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. అంతకుముందు సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాతం, తిరువారాధన జరిపి ఆరగింపు చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. స్వయంభూ ప్రధానాలయంలో కొలువైన ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. సాయంత్రం వేళ ప్రాకారంలో వెండి మొక్కు జోడు సేవోత్సవం, దర్భార్ సేవలు సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామి తిరువారాధనలు, తులసీ నామార్చనలు, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయుడికి సహస్రనామార్చన చేపట్టారు. కొండకింది పాత గోశాల వద్ద సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని, వ్రతం ఆచరించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి.
ఆంజనేయ స్వామికి ఆకుపూజ
యాదాద్రి సన్నిధి క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకు పూజ చేశారు. సింధూరంతో అలంకరించి అభిషేకించడంతో పాటు, తమలపాకులతో అర్చించారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. లలితాపారాయణం చేపట్టి, ఆంజనేయ స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
ఆలయ శుద్ధి
శ్రీవారి ఆలయంలో శుద్ధి పూజలు చేశారు. యాదాద్రి కొండపైన గల బస్బే వద్ద షాద్‌నగర్‌కు చెందిన వృద్ధురాలు సోమవారం రాత్రి మృతిచెందింది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఆలయ తెరిచే సమయంలో ప్రధానాయంలో శుద్ధి పూజలు చేపట్టి, ప్రధానాలయం, ముఖమండపం, మాఢవీధులు, ప్రాకారాల్లో సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్వామివారి సుప్రభాత సేవతో నిత్య కైంకర్యాలు ఆరాధనలు గావించారు.
స్వామిని దర్శించుకున్న ప్రముఖులు
శ్రీవారిని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, ఏపీ రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయానంద్ కుటుంబ సమేతంగా వేర్వేరుగా దర్శించుకున్నారు. మొదటగా వారు స్వయంభువుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి, వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు స్వామి ప్రసాదం అందించారు.