ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నల్లగొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్కిటెక్చర్ సలహాదారు బుధవారం స్థానికంగా పర్యటించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి మెడికల్ కాలేజ్ స్థలం, ఎన్జీ కళాశాలలో భవన సముదాయం, టీఆర్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించారు.
నల్లగొండ, జూన్ 7 : సీఎం కేసీఆర్ త్వరలో నల్లగొండలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసేందుకు రానున్న నేపథ్యంలో ఆర్కిటెక్చర్ బిల్డింగ్ అండ్ ప్లానింగ్ ఆర్అండ్బీ, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ సోమవారం పట్టణంలో పర్యటించి ఆయా పనులు, ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి మొదటగా మెడికల్ కళాశాలను పరిశీలించిన ఆయన అనంతరం ఎన్జీ కళాశాలలో నిర్మాణంలోన ఉన్న భవన సముదాయం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో సీఎం కేసీఆర్ నల్లగొండలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నందున ఆయా పనులను పరిశీలించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అన్నివిధాలా వాస్తుతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యాలయాన్ని నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్జీ కళాశాల భవన నిర్మాణం రూ.30 కోట్లతో చేపట్టడంతో పనులను నాణ్యతతో నిర్మించాలని ఇంజినీర్లకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ రమణాచారి, టీఆర్ఎస్ నాయకుడు సుంకరి మల్లేశ్‌గౌడ్, కౌన్సిలరు శ్రీనివాస్, ఖయ్యూమ్బేగ్, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, అజీజ్, అనిత, రావుల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.