దేవరకొండ, జూన్ 7 : దేవరకొండ సహకార బ్యాంకులో 2014 సంవత్సరంలో జరిగిన కుంభకోణం డొంక కదులుతున్నది. రైతుల సొమ్మును దిగమింగిన కొందరు వ్యక్తులను అరెస్టు చేసినా పోలీసులు మిగిలిన కొందరిని రాజకీయ ఒత్తిడితో వదలి వేశారు. అనంతరం డీసీసీబీ తీర్మానం మేరకు కేసు సీబీసీఐడీకి బదిలీ అయింది. విచారణ చేపట్టిన సీబీసీఐడీ అధికారులు మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి దేవరకొండకు చేరుకుని మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది.
2014లో దేవరకొండ సహకార కేంద్ర బ్యాంకులో రూ.18 కోట్లు అక్రమాలు జరిగినట్లు అప్పటి పోలీసులు కేసు నమోదు చేశారు. దేవరకొండ సహకార బ్యాంకు పరిధిలో గల పీఏపల్లి, చందంపేట మండలం చిత్రియాల, తిమ్మాపూర్ పీఏసీఎస్‌లు, దేవరకొండ సహకార బ్యాంకులో అక్రమాలు జరిగినట్లు తేల్చారు. అయితే ఈ కేసులో నాలుగు పీఏసీఎస్‌ల సెక్రటరీలను అదుపులోకి తీసుకొని విచారించగా 150 మంది నిందితుల పేర్లు ఉన్నట్లు తేలింది. అందులో 32 మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మిగిలిన ప్రధాన నాయకులు ఉండడంతో 100 మంది అక్రమార్కులపై సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. అయితే కరోనా నేపథ్యంలో కేసు ముందుకు సాగలేదు.
మంగళవారం సీఐడీ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. తాము ఎప్పుడు అరెస్ట్ అవుతామోనని తప్పించుకునేందుకు మార్గాలు వెతుకుతున్నట్లు సమాచారం. రూ.18 కోట్ల అక్రమాల్లో బ్యాంకు మేనేజర్ ఆస్తులు జప్తు చేసి రూ.2 కోట్లు రికవరీ చేశారు. గతంలో అరెస్ట్ అయిన 32 మందికి గత నెలలో కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఎంత మందిపై కేసు నమోదు చేస్తారు వేచి చూడాల్సి ఉంది.