తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్దాల తరబడి జరిగిన ఉద్యమాలు ఎన్నో గుణపాఠాలు నేర్పాయి. ప్రధానంగా 1969 ఉద్యమం రక్తపాతాన్ని చవిచూసింది. దీంతో ఇక తెలంగాణ ఏర్పాటు కాదు, సీమాంధ్రులు కానివ్వరు, రాష్ట్ర ఏర్పాటు అనేది కల అనేలా ఈ ప్రాంత ప్రజల్లో గూడు కట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని స్థాపించారు. నాడు ‘గీయనతోటి ఏమైతది, రాష్ట్రం వస్తదా, చస్తదా’ అనుకున్న వాళ్లు తదనంతరం కేసీఆర్ బాటలో నడిచారు. అందులో భాగంగా సూర్యాపేటలో కూడా పిడికెడంత మంది గులాబీ పార్టీలో చేరుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరు టీఆర్ఎస్ బాటపడుతున్న క్రమంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేటకు రావడంతో ఉద్యమానికి ఊపిరి వచ్చి రాష్ట్రంలోనే ఈ ప్రాంతానికి ఉద్యమంలో ప్రత్యేక గుర్తింపు లభించింది.
ప్రపంచంలోని ఓ ప్రాంతంలోని మురుగు నీటిని మరో ప్రాంత ప్రజలు తాగునీటిగా సేవించరని, అలాంటి దౌర్భాగ్య పరిస్థితిని సూర్యాపేట ప్రజలకు పాలకులు కల్పించారని, తెలంగాణ వస్తే స్వచ్ఛమైన తాగునీరు అందిస్తానని నాడు సభా వేదికపై నుంచి కేసీఆర్ చెప్పారు. అధికారంలోకి రాగానే వేల కోట్ల రూపాయలు వెచ్చించి మిషన్ భగీరథ పథకం ద్వారా సూర్యాపేటకు మూసీ నీటి నుంచి విముక్తి కల్పించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలలకు స్వచ్ఛమైన కృష్ణా, గోదావరి జలాలను అందిస్తున్నారు. సాగు, తాగు నీటితోపాటు విద్య, వైద్యం, రోడ్లు, చెరువులు, హరితహారంతో గ్రీనరీ ఇలా ప్రతి ఒక్కటీ అభివృద్ధి చెందుతున్నాయి. 2001 నాటి సూర్యాపేట తొలి ఉద్యమ, రాజకీయ సభలో చెప్పిన ప్రతి మాట నేడు అక్షర సత్యంగా సాక్షాత్కరిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం కోసం కాకుండా కేవలం ఉద్యమానికి ఊపిరిలూదాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో నిలబడి దురాజ్‌పల్లి సర్పంచ్‌గా కృష్ణ, పెన్‌పహాడ్ మండలం మాచారం ఎంపీటీసీగా జి.వెంకటేశ్వర్లు, సూర్యాపేట మండలం గాంధీనగర్‌లో వార్డు మెంబర్‌గా ఒట్టె జానయ్యయాదవ్ గెలిచారు. వట్టె జానయ్యయాదవ్ ఉపసర్పంచ్ అయ్యారు. అనంతరం సూర్యాపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అభ్యర్థులు బీరవోలు రవీందర్‌రెడ్డి, నల్లగుంట్ల అయోధ్య గెలుపొందగా రవీందర్‌రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ వస్తే ఎస్ఆర్ఎస్పీ ద్వారా సూర్యాపేట జిల్లాకు గోదావరి తెస్తానని, కుర్చీ వేసుకొని కాల్వలు తవ్విస్తానని నాడు కేసీఆర్ హామీ ఇచ్చార. రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి నేడు సూర్యాపేట జిల్లాలోని సుమారు 2.60 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందుతున్నాయి.
2001 జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో గెలుస్తామనే ఆశతో కాకుండా అప్పటికే పార్టీ స్థాపించి మూడు నెలలు కావడంతో ఎన్నికల పేరిట ఉద్యమానికి ఊపిరి పోయాలనే లక్ష్యంతో సూర్యాపేటలో ప్రచార సభను నిర్వహించారు. హైదరాబాద్ నుంచి నేరుగా సూర్యాపేటకు హెలికాప్టర్లో వచ్చారు. స్కూటర్ ఎక్కి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఎవరూ ఊహించని రీతిన సభకు స్వచ్ఛందంగా భారీగా జనం హాజరయ్యారు. దీంతో కేసీఆర్ తన ప్రసంగంలో ఉద్యమం ఎలా చేయబోతున్నాం, రాష్ట్రం ఎలా సాధించుకుంటాం, సాధించుకున్న రాష్ర్టాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటామో వివరించి అందుకు అంతా సిద్ధంగా ఉండాలని కోరారు.