యాదాది, జూన్1 : ‘ నేను ఈ గడ్డలో పుట్టిన ఈ బిడ్డను.. ఈ మట్టిలో పుట్టిన వాణ్ణి.. మీ చేతుల్లో పెరిగిన వాణ్ణి.. తెలంగాణ గాలి పీల్చి, తెలంగాణ నీళ్లు తాగి పెరిగిన వాణ్ణి.. సీమాంధ్రులు మనల్ని మనుషులుగా చూడలే.. మన గుళ్లు, గోపురాలను పట్టించుకోలే.. దేవుడి నుంచి వచ్చిన పైకమంతా సంచులు నింపుకుని పోయిండ్రు.. కానీ ఇక్కడి ఆలయాలను అభివృద్ధి చేయాలని ఏనాడూ వారు అనుకోలేదు..
రాష్ట్రం ఏర్పాటైనంక నర్సన్న ఆలయాన్ని ప్రపంచమే గర్వపడే విధంగా అభివృద్ధి చేస్తా..’ అని నాటి తెలంగాణ ఉద్యమ పోరాటంలో సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు వచ్చిన సమయంలో అన్నమాటలివి. ఇచ్చిన హామీని మరిచిపోకుండా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారు. 2015 సంవత్సరంలో దసరా రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా సుమారు ఆలయ నిర్మాణం పూర్తయి గతమార్చి 28వ తేదీన పునః ప్రారంభమైంది.
