నల్లగొండ, మే 31 : కొందరు సర్పంచులు కావాలనే ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని, ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని, వెంటనే వాటిని
మానుకోవాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి సూచించారు. మంగళవారం జడ్పీలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో ఏ ప్రభుత్వాలూ ఇవ్వని నిధులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నదని, అది మరిచి సర్పంచులు అనవసరంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సర్పంచులు ఎంబీలు ఇవ్వకుండా బిల్లులు ఇవ్వాలని కోరడం సరికాదని, చేసిన పనులకు బిల్లులు ఇస్తే సకాలంలో డబ్బులు వస్తాయని చెప్పారు.
మునుగోడు సర్పంచ్ రూ.40 లక్షలు రావాలని భిక్షాటన చేసి ప్రభ్వుత్వాన్ని బదనాం చేశాడని, పంచాయతీరాజ్ యంత్రాంగం విచారణ చేస్తే రూ.3 లక్షలు మాత్రమే
తేలినట్లు తెలిపారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో లెక్కల కారణంగానే కొంత ఆలస్యం జరిగిందే తప్ప, వేరే కారణం లేదన్నారు. వర్కర్ల జీతాల విషయంలో రెండు
నెలలే పెండింగ్ ఉన్నాయన్నారు. ఆ సర్పంచ్ ఒక్క రూపాయి కూడా తన చేతి నుంచి పెట్టుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే భిక్షాటన చేసినట్లు తెలిపారు. నిధుల
విషయంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తున్న కారణంగానే ఆ గ్రామ పంచాయతీలో డబ్బులు జమ కాలేదన్నారు. అంతేకాకుండా మునుగోడు నియోజకవర్గంలో
ఎర్రగంట్లపల్లి సర్పంచ్ పుస్తెలతాడు అమ్మి వడ్డీ కడుతున్నానని చెప్పడం అవాస్తవమని, అసలు వాళ్లు చేసిన పనులకు ఎంబీలే చేయలేదన్నారు.
నెల్లికల్లు గ్రామ పంచాయతీ విషయంలో రూ.13 లక్షలు రావాలని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రూ.6.5 లక్షలే రావాల్సి ఉన్నాయని తెలిపారు. పులిచర్లకు
రూ.19.50లక్షలు రావాలని అనడం సరికాదని, రూ.9 లక్షలు మాత్రమే రావాల్సి ఉండగా ఆర్థిక సంవత్సరం చివరలో కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఆలస్యం
అయ్యిందన్నారు. సర్పంచులు చేసిన పనులకు సంబంధించి ఎంబీలను ఎప్పటికప్పుడు అధికారులకు అందజేయాలని, ఆలస్యం చేస్తే బిల్లులు రావాన్నారు. ప్రభుత్వం
మీద అనవరమైన ఆరోపణలు చేస్తే అధికారులు విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.