నందికొండ, ఆగస్టు 11 : ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. వరద పోటెత్తుతుండడంతో నాగార్జున సాగర్ పూర్తిగా నిండగా గురువారం ఉదయం 5:30 గంటలకు ప్రాజెక్టు అధికారులు గేట్లను ఎత్తారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 4,38,272 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 4,24,942 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద అంచనా మేరకు గేట్ల సంఖ్యను తగ్గించడం, పెంచడం చేస్తున్నారు. 2009 తర్వాత సీజన్ మొదట్లోనే మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఎత్తడం ఒక రికార్డు. గేట్లు ఎత్తడంతో సాగర్ అందాలను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు దిగడంతో సందడిగా మారింది.
నందికొండ, ఆగస్టు 11: కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జునసాగర్‌కు పెద్ద ఎత్తున కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 4,38,273క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో ఎన్ఎస్పీ సీఈ శ్రీకాంత్‌రావు, ఎస్ఈ ధర్మానాయక్‌తో కలసి పూజా కార్యక్రమాలు నిర్వహించి గురువారం ఉదయం 5.30గంటలకు 10క్రస్ట్‌గేట్లను ఎత్తారు. అనంతరం క్రమంగా పెంచుతూ 2గంటలకు 26గేట్లకు పెంచి అదేవిధంగా కొనసాగిస్తున్నారు. వరద రాకను బట్టి క్రస్ట్‌గేట్లతో 3,80,016క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాంలో నిల్వ ఉన్న నీరు, క్రస్ట్‌గేట్లతో కొనసాగుతున్న అవుట్‌ఫ్లో, వరద రాక, లోతట్టు ప్రాంత ప్రజల రక్షణకు తీసుకున్న చర్యలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. క్రస్ట్‌గేట్లతో కొనసాగుతున్న నీటి విడుదలను ఎమ్మెల్యే నోముల భగత్ పర్యవేక్షించి డ్యాంపై జాతీయ జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాజెక్టు పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న నీటిని తాగు, సాగుకు సద్వినియోగం చేసుకుంటూ, ప్రతి ఎకరాకూ నీరందించేందుకు ప్రభు త్వం ప్రణాళికలతో ముందుకు పోతుందన్నారు. ప్రాజెక్టు నిండి రెండు పంటలకు నీరు కొదవ లేకపోవడంపై రైతులు ఆనందం ఉన్నారన్నారు. వరద ఉధృతిని బట్టి క్రస్గేట్లతో నీటిని విడుదల చేస్తున్నట్లు డ్యాం సీఈ శ్రీకాంత్‌రావు తెలిపారు. క్రస్ట్‌గేట్లతో నీటి విడుదల కొనసాగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం ఉండాలని డ్యాం ఎస్ఈ ధర్మానాయక్ సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి, కౌన్సిలర్లు రమేశ్‌జీ, నిమ్మల ఇందిరాగౌడ్, నాయకులు రాంబాబు, కర్న శరత్‌రెడ్డి, కే.కృష్ణ, మంద శాంతకుమారి, ఎన్ఎస్పీ ఈఈ, డీఈలు, ఏఈ పాల్గొన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 885అడుగులకు గాను ప్రస్తుతం 884.40అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు 3,94,759 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా జల విద్యుత్ కేంద్రాలతో 61,603క్యూసెక్కులు, 10 క్రస్టుగేట్లను 15అడుగుల మేరకు ఎత్తి 3,76,670క్యూసెక్కులు మొత్తంగా 4,38,273 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకు గాను 588.00(306.1010 టీఎంసీలు) అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 4,38,273క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా కాల్వ లు, జలవిద్యుత్ కేంద్రం, క్రస్ట్‌గేట్లతో 424942క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతున్నది.
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు గురువారం 4979.27క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా మూడు క్రస్ట్‌గేట్లతో 4932.58క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 638.35 అడుగులు (2.85టీఎంసీలు)గా ఉంది. కుడి కాల్వకు 217.45క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 159.46క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.