నల్లగొండ, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదని, అమరుల త్యాగం వెలకట్టలేనిదని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ఆమె ఆదివారం పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు క్లాక్ టవర్ చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించి స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఆ తర్వాత పోలీస్ సేవా పతకాలను ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 1969 ఉద్యమానికి ప్రత్యేక ప్రస్థానం ఉందని, జంటిల్ మెన్స్ అగ్రిమెంట్‌లోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు కదిలివస్తే ఆ పోరాటంలో దాదాపు 300 మందికి పైగా అమరులయ్యారని తెలిపారు. రెండో దశ ఉద్యమంలో 2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఐక్య కార్యాచరణ సమితి చేతుల్లోకి వెళ్లడంతో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు చురుకుగా పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
ఎందరో త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించినట్లు తెలిపారు. ప్రజలందరూ తమ హకులను ఉపయోగించుకుంటూ, బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సూచించారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, అదనపు ఎస్పీ రాములు నాయక్, డీఆర్ఓ డి.రాజ్యలక్ష్మి, ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.