రామగిరి, డిసెంబర్ 08 : గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి నెరవేర్చని నాటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. ఈ మేరకు సోమవారం బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోని ఎన్నికల అధికారికి కూడా సమర్పించినట్లు తెలిపారు.
కామారెడ్డి డిక్లరేషన్ బీసీ అనే ఒక బుక్లెట్ కూడా తీయడం జరిగింది. రిజర్వేషన్లు, కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్ల పెంపు, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుండి 42 శాతానికి పెంపు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తున్నా, కొత్త జీఓ నంబర్ 46 తీసి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు.
కావునా కాంగ్రెస్ పార్టీ బీసీలను ఎన్నికల సమయంలో కేవలం ఓట్లు వేయించుకుని మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఈ రోజు బీసీలను విస్మరించినందుకు బీఎన్ఎస్ నూతన చట్టం ప్రకారం రేవంత్ రెడ్డి అలాగే పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ మున్నాస్ ప్రసన్నకుమార్, బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ కర్నాటి యాదగిరి, బీసీ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జి అజయ్ కుమార్, బీసీ జేఏసీ పట్టణ చైర్మన్ పుట్ట వెంకన్న, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిలక రాజ్, సతీష్ కుమార్, జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ భరత్, పట్టణ వైస్ ప్రెసిడెంట్ చిన్నోజు రాజు, విజయ చారి, అనంతుల నాగరాజు గౌడ్, బాతుక సతీశ్, అంబటి శివ పాల్గొన్నారు.