ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ పెద్దాయన ఏలుబడిలో 35 ఏండ్లు ఉన్న నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం అన్ని రంగాల్లో వెనుకబడింది. నాడు ఇక్కడ విద్య ద్రాక్ష. ప్రజారోగ్యం గాల్లో దీపం. గుంతల రోడ్లపై ప్రయాణం నిత్యం నరకం. తలాపునే కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా తాగు, సాగునీటికి దశాబ్దాల తరబడి గోస తీసిన దైన్యం. ఎడమ కాల్వను ఎండ బెట్టి డెడ్ స్టోరేజీలో డెల్టాకు నీళ్లు తీసుకుపోయినా ఇక్కడి నేతలు నోళ్లు మెదపని వైనం. ఉద్యమ రోజుల్లోనే పాదయాత్ర ద్వారా ఇక్కడి పరిస్థితులను గుర్తించి గళమెత్తిన కేసీఆర్..
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక సాగర్ నియోజకవర్గ సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతూ వచ్చారు. 2018లో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి నోముల నర్సింహయ్య బీఆర్ఎస్ జెండా ఎగురవేయడంతో ఇక్కడ అభివృద్ధికి అడుగులు పడ్డాయి. ఆయన అకాల మరణంతో అనివార్యంగా జరిగిన ఉప ఎన్నికలో నోముల భగత్ విజయం సాధించడంతో మొత్తంగా నియోజకవర్గ దశే మారిపోయింది. ప్రభుత్వ విద్య చేరువైంది. ప్రజా వైద్యం మెరుగుపడింది. చివరి భూములకూ నీళ్లందించేందుకు ఎత్తిపోతల నిర్మాణం జరుగుతున్నది. మిషన్ కాకతీయతో సాగునీటి లభ్యత పెరిగింది. వరద కాల్వ నిర్మాణం పూర్తిచేసుకుని ఏడు మండలాల్లో సుమారు 80వేల ఎకరాలకు సాగు, తాగునీరందిస్తున్నది. సబ్ స్టేషన్లు, కొత్త లైన్ల నిర్మాణంతో విద్యుత్ వ్యవస్థ పటిష్టంగా మారింది. వందల కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలు, గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఒకనాడు తాగునీటికి తండ్లాడిన మారుమూల తండాలకు సైతం నేడు ఇంటికే మిషన్ భగీరథ నీళ్లందుతున్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సమైక్య రాష్ట్రంలో సాగర్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడింది. కనీస మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, రోడ్డు రవాణా సౌకర్యాలు అంతగా కల్పించలేదు. తలాపున కృష్ణమ్మ పరుగెడుతున్నా తాగునీటికి ప్రజలు అరిగోస పడ్డారు. కాల్వ చివరి భూములకు సాగు నీరందక పంటలు ఎండిపోయిన పరిస్థితి. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టింది. ఇక్కడ బీఆర్ఎస్ గెలుపొందాక ప్రగతి పరుగులు తీసింది. మౌలిక సదుపాయాలు, తాగు, సాగు నీరు, రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. 2021లో నోముల భగత్‌కుమార్ ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధిలో దూకుడు పెరిగింది. రెండేండ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దీంతో పలు అభివృద్ధి పనులు జరిగాయి. సంక్షేమ ఫలాలూ అన్ని వర్గాలకు అందుతున్నాయి
Nalgonda3
రూ.18 కోట్లతో కమలానెహ్రూ ఆస్పత్రి ఆధునీకరణ
సీఎం కేసీఆర్ పాలనలో సాగర్‌లోని కమలానెహ్రూ ఆసుపత్రిని 100 పడకలకు పెంచి రూ.18 కోట్లతో ఆధునీకరించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. ఇటీవల పీడియాట్రిక్ విభాగం ఏర్పాటు చేయడంతోపాటు డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయగా ఆసుపత్రి భనవ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3.5 కోట్లు విడుదల చేసింది.
సర్కారు దవాఖానలు బలోపేతం
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పేదలకు ప్రభుత్వ వైద్యం చేరువైంది. అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను నియమించారు. నూటికి 70 శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి.
లక్ష ఎకరాలకు సాగునీరు
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నాగార్జున సాగర్ నినియోజకవర్గంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2014లో సాగు విస్తీర్ణం 1.87 లక్షల ఎకరాలు కాగా నేడు 2.38 లక్షల ఎకరాలకు చేరింది. లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తుండగా కొత్తగా 50 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది.
రూ.64 కోట్లతో రహదారులు, వంతెనల నిర్మాణం
సాగర్ నియోజకవర్గంలో గ్రామాలకు వెళ్లేందుకు రహదారులు, వంతెనల నిర్మాణం, మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.64 కోట్లు విడుదల చేసింది. త్రిపురారం మండల కేంద్రం నుంచి మాడ్గులపల్లి మండలం కుక్కడం వరకు.. మారెమ్మ గుడి నుంచి తుమ్మడం వరకు, సూరేపల్లి, వెనిగండ్ల, ముకుందాపురంతోపాటు చింతగూడెం, రామడుగు, యాచారం గ్రామాల్లో రోడ్ల పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 70 శాతం పనులు పూర్తి కాగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయి.
ప్రగతి పరుగులు
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో హాలియా, నాగార్జునసాగర్ పట్టణాలు మున్సిపాలిటీలుగా మారాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు వచ్చింది. రాజవరం మేజర్‌కాల్వ చివరి భూములకు సాగునీరు అందుతున్నది. పూడిపోయిన సుమారు 200 చెరువులు మిషన్ కాకతీయతో జలకళ సంతరించుకున్నాయి. బీడు భూముల్లోకి కృష్ణా జలాలు పారించేందుకు నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. సబ్ జూనియర్ కోర్టు ఏర్పాటు, వాణిజ్య బ్యాంకుల రాకతో పాత తాలూక కేంద్రమైన నిడమనూరు కొత్తశోభను సంతరించుకుంది. రూ.18 కోట్లతో సాగర్‌లో కమలానెహ్రూ ఆసుపత్రిని ఆధునీకరించి కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రజలకు అందిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో నత్తనడకన సాగిన వరదకాల్వను పూర్తి చేసి 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అహల్య వాగుతోపాటు నియోజకవర్గంలోని పలు వాగులు, వంకల ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటికి చెక్‌డ్యామ్‌ల రూపంలో అడ్డుకట్ట వేశారు. దాంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.
హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ.119.20 కోట్లు
2018లో రాష్ట్ర ప్రభుత్వం హాలియా, నందికొండను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే నోముల భగత్ చొరవతో ఈ మున్సిపాలిటీలకు రెండేండ్లలో రూ.119.20 కోట్లు మంజూరయ్యాయి. హాలియా మున్సిపాలిటీకి రూ.43,20 కోట్లు, నందికొండ మున్సిపాలిటీకి రూ.72 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్, మినీ స్టేడియం, డిజిటల్ లైబ్రరీ, ఆడిటోరియం నిర్మించండంతో పాటు తాగునీరు, సీసీ రోడ్లు ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
స్వరాష్ట్రంలోనే బుద్ధవనానికి ప్రాధాన్యం
ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రాంతం నాగార్జున సాగర్. బౌద్ధమతం ప్రజ్వరిల్లిన ప్రదేశం కావడంతో ప్రపంచ బౌద్ధ సంస్కృతీ సంప్రదాయాలు కనిపించేలా 2006లో రూ.67 కోట్లతో 277 ఎకరాల్లో బుద్ధవనం ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. నాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా నిధులు విడుదల చేయకపోవడంతో 2014లో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.25 కోట్లు విడుదల చేసింది. గతేడాది మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.
అభివృద్ధికి అడ్డుపడిన కరోనా
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆ సమయంలో కరోనా మమమ్మారి వల్ల ఏడాదిన్నర కాలం పాటు అభివృద్ధి పనులు ఆగిపోయాయి. నోముల నర్సింహయ్య అకస్మాత్తుగా మరణించడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ గెలవడంతో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి.
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు
మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీటిని అందిస్తున్నారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.108. 57 కోట్లు ఖర్చు చేసింది. మంచినీటి రాకతో మహిళలు బిందెలతో రోడ్డెక్కే పరిస్థితికి చెక్ పడింది.
పలు అభివృద్ధి పనులు
సంక్షేమ పథకాలు
నియోజకవర్గ సమగ్రాభివృద్ధే నా లక్ష్యం
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా సాగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడి పోయింది. 2014లో దివంత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఈ నియోజకవర్గానికి వచ్చే నాటికి ఇతర ప్రాంతాలతో పోల్చితే ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇక్కడ అభివృద్ధి అంతా దీపం చుట్టూ ఉన్న వెలుతురులాంటిది. ఉన్నత విద్య, వైద్యం, ప్రజారోగ్యం, తాగునీరు, సాగునీరు ఇతర ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయలు కల్పించడంలో 35 ఏండ్లు ప్రజాప్రతినిధిగా ఉన్న పెద్ద మనిషి విఫలం చెందారు. సాగర్ ఎడమ కాల్వ నీళ్లు పొరుగు రాష్ట్రంలో ఉన్న కృష్ణాజిల్లాకు పోతుంటే ఈ నియోజకవర్గంలో ఎడమ కాల్వ మొదటి మేజర్ రాజవరం గ్రామానికి రాని పరిస్థితి. ఇక్కడి ప్రజలు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయలేదు.
గ్రామ గ్రామాన జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారులు ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఒక్క స్టేడియం కూడా ఏర్పాటు చేయలేదు. 18 ఏండ్లు మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లాను ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించలేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి కూడా ఇక్కడి ప్రజలకు తాగునీరు ఇవ్వలేదు. వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కే వారు. తిరుమలగిరి సాగర్ మండలంలో ఆయన పేరుమీద ఉన్న కాలనీ ప్రజలు ఏటా బిందేలతో రోడ్డెక్కి నిరసన తెలిపేవారు. కృష్ణానది చెంతనే ఉన్నా కృష్ణపట్టె ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. రెండేండ్లలోనే గత పాలకులు చేయని ఎన్నో పనులు పూర్తి చేశాను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే ఇక్కడ అభివృద్ధి ప్రారంభమైనది. రెండు డిగ్రీ కాలేజీలు, నెల్లికల్లు లిఫ్ట్ మంజూరయ్యాయి. హాలియాకు మినీ స్టేడియం వచ్చింది. రాజవరం మేజర్ కాల్వ చివరి భూములకు సాగు నీరు అందుతున్నది. విద్యుత్ లోఓల్టేజీ సమస్యల పరిష్కారమైంది. నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నా.
– నోముల భగత్ కుమార్, ఎమ్మెల్యే, నాగార్జున సాగర్
రూ.684 కోట్లతో నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణం
నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణం ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తలాపున కృష్ణమ్మ పరుగెడుతున్నా 50 ఏండ్లుగా తాగు, సాగునీటికి నోచుకోని దయనీయ పరిస్థితి ఉండేది. నాగార్జున సాగర్ జలాశయానికి ఆనుకొని ఉన్న కృష్ణపట్టె ప్రాంతంలోని టెయిలెండ్ భూములతోపాటు తిరుమలగిరి సాగర్ మండలంలోని 24,886 ఎకరాల బీడు భూములకు సాగు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నెల్లికల్లు లిఫ్ట్‌ను మంజూరు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి లిఫ్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం రూ.684 కోట్లతో లిఫ్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నాగార్జున సాగర్ జలాశయం వరద నీటితో నిండడంతో లిఫ్ట్ నిర్మాణ పనులు కొంత ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం పంప్ హౌజ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లిఫ్ట్ నిర్మాణం ఏడాదిలోపే పూర్తయ్యే అవకాశం ఉంది.
కొత్తగా రెండు డిగ్రీ కళాశాలల ఏర్పాటు
బీఆర్ఎస్ పాలనలో సాగర్ నియోజకవర్గానికి రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. ఒకటి హాలియాలో, మరొకటి నాగార్జున సాగర్‌లో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారింది.
117 పాఠశాలల్లో సకల సదుపాయాలు
మన ఊరు మన బడి కింద ప్రభుత్వం 117 పాఠశాలలను ఎంపిక చేసింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.19,12,8,751 ఖర్చు చేసింది. కార్పొరేట్‌కు దీటుకు రూపుదిద్దుకుంటున్నాయి.
11 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం
లోఓల్టేజీ సమస్య పరిష్కారానికి నియోజకవర్గంలో కొత్తగా 11 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. వ్యవసాయ, గృహ, పారిశ్రామిక అవసరాలకు 24గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది.
గ్రామీణాభివృద్ధికి రూ.200 కోట్లు
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఆరు మండలాలకుగానూ 188 గ్రామ పంచాయతీలు, 347 ఆవాస గ్రామాలు ఉన్నాయి. 2.22 లక్షలకు పైగా జనాభా ఉంది. ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.200 కోట్లు ఖర్చు చేసింది. ఎస్డీఎఫ్ కింద రూ.120 కోట్లు, సీసీరోడ్లకు రూ.37.60 కోట్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం రూ.9.20 కోట్లు, వైకుంఠధామాలకు రూ.24 కోట్లు ఖర్చు చేసింది.
వరదకాల్వతో 80 వేల ఎకరాలు సాగులోకి
ఏడు మండలాల్లో సుమారు 80వేల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించాలనే సంకల్పంతో దివంగత శాసన సభ్యుడు గుండెబోయిన రాంమూర్తి యాదవ్ కృషితో అప్పటి ప్రభుత్వం 1997లో వరద కాల్వను మంజూరు చేసింది. గత కాంగ్రెస్ పాలనలో వరద కాల్వ నిర్మాణం నత్తనడకన సాగితే 2014లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేండ్లలోనే సుమారు రూ.91 కోట్ల పెండింగ్ పనులు పూర్తి చేశారు. ఎన్ఎస్పీ కింద స్థిరీకరించిన 30 వేల ఎకరాలు కలుపుకొని మొత్తం 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం కొత్తగా భూములు సాగులోకి రాగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి.
మాట నిలుపుకొన్న ప్రభుత్వం
నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణ పనులను ప్రారంభించి ప్రభుత్వం మాట నిలుపుకున్నది. గత ఎన్నికల సమయంలో ఇక్కడికి ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు నెల్లికల్లు లిఫ్ట్ బీఆర్ఎస్ పార్టీ చేయదని తప్పుడు ప్రచారం చేశారు. కానీ మేము వాళ్ల మాటలు నమ్మలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చిన విధంగానే నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణ పనులు ప్రారంభించినందుకు ఆనందంగా ఉంది.
– రమావత్ దస్రూనాయక్, ఎర్రచెరువుతండా, తిరుమలగిరి సాగర్ మండలం
డిగ్రీ కళాశాల ఏర్పాటుతో పేద విద్యార్థులకు మేలు
హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం గతంలో అనేక సార్లు ఉద్యమాలు చేశాం. కానీ పాలకులు పట్టించుకోలేదు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య విజ్ఞప్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు ఆర్థిక, దూరభారం తప్పింది. ఉన్నత విద్యను ఇక్కడే చదువుకునే అవకాశం లభించింది.
-పిల్లి అభినయ్, విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు
వరద కాల్వతో నీళ్ల బాధ తీరింది
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే వరద కాల్వకు సాగునీరు వచ్చింది. నేను ఐదేండ్లుగా వరద కాల్వ కింద 10 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. కాల్వ వచ్చినంక నీటి మట్టం పెరిగింది. వేసవిలో తాగు, సాగునీటి బాధలు పోయాయి. ఒకప్పుడు బీడుగా ఉండే భూములు ఇప్పుడు పచ్చగా మారినయి. కూలీలకు చేతినిండా పని దొరికింది.
-కట్టెబోయిన వెంకటేశ్వర్లు, రైతు, చింతపల్లి, పెద్దవూర మండలం.
హాలియా ఎంతో అభివృద్ధి చెందింది
హాలియా మున్సిపాలిటీ అభివృద్ధి పనులతో సరికొత్తగా కనిపిస్తున్నది. రెండేండ్లలోనే రూపురేఖలు మారిపోయాయి. రోడ్డు విస్తరించి, సెంట్రల్ లైటింగ్ వేశారు. వీధుల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు. వెజ్అండ్ నాన్‌వెజ్ మార్కెట్ యార్డు కడుతుండ్రు. వైకుంఠధామం పూర్తయ్యింది. గతంలో అభివృద్ధి పనులు కావాలని ఎమ్మెల్యే కోసం హైదరాబాద్‌కు పోవాల్సి వచ్చేది. ఎమ్మెల్యే భగత్ స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
-షేక్ బాబుద్దిన్, హాలియా మున్సిపాలిటీ