సూర్యాపేట అర్బన్ నవంబర్ 8: అనుమతి పత్రాలు ఏవీ లేకున్నా అధికారులకు కావాల్సిన కరెన్సీ నోట్లు ఇస్తే చాలు అన్ని అనుమతులూ ఇంటికే వస్తాయని జిల్లా మత్స్య శాఖ అధికారులు మరోసారి రుజువు చేశారు. జిల్లా మత్స్య శాఖ అధికారులు, సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వారి చేపల చెరువులను క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు. అనుమతులు ఉండి సకాలంలో టెండర్ వేసిన వారికి నిబంధన ప్రకారం టెండర్లు ప్రకటించకుండా తమకు అనుకూలమైన వారికి (డీఎల్సీ)డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ అనుమతుల్లేకున్నా టెండర్లు ప్రకటించారు.
వేర్వేరు సర్వే నంబర్లతో పత్రాలు ఉన్నా పరిశీలించకుండా…డిస్ట్రక్ట్ లెవల్ కమిటీ సర్టిఫికెట్ లేకున్నా…ఆ చెరువుల్లో చేపల సీడ్ లేదని తెలిసినా ముడుపులు ఇస్తే అన్ని అనుమతులు వస్తాయని జిల్లా అధికారులను సైతం పక్కదారి పట్టించవచ్చని జిల్లా మత్య్సశాఖ అధికారులు నిరూపించారు.
నిబంధనల ప్రకారం టెండర్లలో పాల్గొన్నవారు టెండర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను పూర్తిగా సమర్పించాలి. అనుమతి పొందిన టెండర్ దారుడు పూర్తి డాక్యుమెంట్ సమర్పించకుండానే అధికారులు అనుమతులు ఇచ్చారు. నిబంధనల ప్రకారం 4 రకాల చేప పిల్లలను పంపిణీ చేసే వారికి, ప్రతి రకానికి సంబంధించిన 4 చెరువులు ఉండాలి. టెండర్ దక్కించుకున్న వారికి ఉన్నది ఒక్క చెరువు మాత్రమే. ఒకే చెరువు ఉన్న టెండర్ దారుడు 4 రకాలు (సుమారు 3 కోట్ల )పిల్లల్ని ఎలా సప్లయ్ చేస్తాడనే విషయం జిల్లా అధికారులకు అర్థం కాకపోవడం గమనార్హం. అధికారులకు సమర్పించిన పత్రాల్లో ఉన్న సర్వే నెంబర్లలో చేపల చెరువులకు బదులు నివాస గృహలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిబంధలన్నీ మాకు వర్తించవన్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రవర్తిస్తున్నారు.
మత్య్సశాఖ మాయాజాలంలో భాగంగా అనుమతి పొందిన ఒకే కాంట్రాక్టర్ ఖమ్మం జిల్లాలోని మత్స్యశాఖ టెండర్లలో పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఖమ్మం జిల్లా మత్స్యశాఖ అధికారులు సరైన పత్రాలు, చేపల చెరువుల్లో రొయ్యలు, ఫంగస్ మాత్రమే పెంచుతున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని నిరాకరించారు. కాంట్రాక్టర్ సూర్యాపేట జిల్లాలో వేసిన టెండర్లలో స్థానం దక్కించుకోవడం గమనార్హం. అక్కడ చెల్లని వ్యక్తికి ఇక్కడ ఎలా అనుమతులు వచ్చాయని ఆశ్చర్యపోతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లో పాల్గొనాలంటే డీఎల్సీ నుంచి తీసుకున్న అనుమతి పత్రం ప్రతి టెండర్ దారుడు జిల్లా అధికారులకు దరఖాస్తుతో పాటు సమర్పించాలి. టెండర్ పొందిన టెండర్‌దారులు డీఎల్సీ సర్టిఫికెట్ లేకుండానే టెండర్ దక్కించుకున్నారు. కొసమెరుపు ఏమిటంటే టెండర్‌దారుడు సమర్పించిన పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న సర్వే నెంబర్ వారు సమర్పించిన ఫేక్ డీఎల్‌సీలో ఉన్న సర్వే నంబర్ వేర్వేరుగా ఉన్నా అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత సంవత్సరం తప్పుడు పత్రాలతో టెండర్ దక్కించుకున్న వీరు ప్రభుత్వం అందించిన ఉచిత చేప పిల్లల పంపిణీని సక్రమంగా పూర్తి చేయలేక అంతంత మాత్రంగా పంపిణీ చేశారు. చివరికి జిల్లా మొత్తంలో కేవలం 50 నుంచి 60 శాతం మాత్రమే పూర్తి చేసి మిగిలిన చెరువులకు ఉచిత చేప పిల్లలను అందించలేకపోయిన సంగతి తెలిసిందే. ఈసారి టెండర్ దక్కించుకున్న వారు ఇప్పటి వరకు తాము చూపించిన ఒక్క చెరువులో కూడా చేప పిల్లలు పెంచడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ సంవత్సరం అందించాల్సిన సుమారు 3.5 కోట్ల చేప పిల్లలను అందిస్తారనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
అధికారులకు ముడుపులు చెల్లించి టెండర్ దక్కించుకున్న విషయంపై మత్స్యకారులు, ఇతరపత్రాలు సక్రమంగా ఉన్నా ముడుపులు చెల్లించలేదని టెండర్లు దక్కని వారు అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం. దీంతో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతోనైనా కలెక్టర్, అదనపు కలెక్టర్లు స్పందించి విచారణ చేపట్టి, తమ నిబద్ధత చాటుకుంటారో లేదో వేచి చూడాలి. ఈ విషయంపై జిల్లా మత్స్యశాఖ అధికారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.