చిట్యాల, నవంబర్ 8: ఇన్నోవా కారు డివైడర్‌ను ఢీకొని దగ్ధమైన సంఘటన మండలంలోని గుండ్రాంపల్లిలో జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం…హైదరాబాద్‌కు చెందిన ప్రకాశ్ పటేల్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం తెల్లవారు జామున ఇన్నోవా కారులో విజయవాడ దిశగా వెళ్తుండగా గుండ్రాంపల్లి శివారులోని యూ టర్న్ వద్ద కారు అదపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది.
దీంతో కారు రోడ్డుకు అవతల ఉన్న హైదరాబాద్ మార్గంలో పడింది. ఇన్నోవా కారులో మంటలు చెలరేగాయి. అదే సమయంలో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ డ్రైవర్లు సాహసోపేతంగా వ్యవహరించి మంటలు అంటుకుంటున్నా.. ఇన్నోవా కారు అద్దాలు పగులగొట్టి అందులో ప్రయాణిస్తున్న 8 మందిని క్షేమంగా బయటకు తీశారు. ఈ సంఘటనలో ఇన్నోవా కారు డ్రైవర్‌తో పాటు ఇద్దరు లారీ డ్రైవర్లు గాయపడినట్లు తెలిసింది. ఇన్నోవా పూర్తిగా దగ్ధమైంది. దీంతో హైవేపై కొంత సేపు ట్రాఫిక్ జామైంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు.